Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump-Putin Meet: యుద్ధ ముగింపుపై ట్రంప్ దూకుడు.. పుతిన్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

Trump-Putin Meet: యుద్ధ ముగింపుపై ట్రంప్ దూకుడు.. పుతిన్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

Trump strategy to end Ukraine war: దాదాపు మూడేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. గతంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను కచ్చితంగా సమావేశమవుతానని, అందుకు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలవాలన్న షరతు ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. యుద్ధాన్ని ఆపేందుకు తాను విధించిన గడువు ముగుస్తున్న వేళ ట్రంప్ చేసిన ఈ ప్రకటన, శాంతి చర్చలపై కొత్త ఆశలు రేపుతోంది. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి..? ఈ భేటీతో యుద్ధం ఆగుతుందా..? లేక ముగ్గురు నేతలు కలిసి చర్చించే అద్భుతం జరగనుందా..?

- Advertisement -

పుతిన్‌తో భేటీ ఖాయం.. షరతులు లేవు: అమెరికాతో సమావేశం కావాలంటే పుతిన్ ముందుగా జెలెన్‌స్కీతో భేటీ కావాల్సిన అవసరం ఉందా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, “లేదు. అలాంటి అవసరం ఏమీ లేదు” అని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. వచ్చే వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ట్రంప్‌తో సమావేశం కావాలని ఆశిస్తున్నట్లు పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఓ వైట్‌హౌస్ అధికారి, “పుతిన్-జెలెన్‌స్కీ భేటీ జరిగితేనే, ట్రంప్-పుతిన్ సమావేశం ఉంటుంది” అని చెప్పడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే, ఈ విమర్శలను పట్టించుకోకుండా, పుతిన్‌తో తాను కచ్చితంగా భేటీ అవుతానని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/netanyahu-offers-advice-modi-trump/

గడువు ముగిసే వేళ.. “ఇక పుతిన్ ఇష్టం”: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేందుకు రష్యా చొరవ చూపాలని, లేదంటే తీవ్ర ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇందుకు శుక్రవారం వరకు గడువు కూడా విధించారు. ఆ గడువు ముగుస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గడువు సంగతేంటి అని అడగ్గా, “అది పుతిన్ చేతుల్లో ఉంది. ఇక ఆయన ఇష్టం. ఆయన ఏం చెబుతారో చూద్దాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా జరుగుతున్న ప్రాణనష్టంపై స్పందిస్తూ, “ఇలా ఎక్కువసేపు వేచి ఉండటం నాకు ఇష్టం లేదు. ఇది చాలా సిగ్గుచేటు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ:https://teluguprabha.net/international-news/trump-india-trade-talks-dispute/

త్రైపాక్షిక చర్చలకు రంగం సిద్ధమా: మారుతున్న పరిణామాలను గమనిస్తే, ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీల మధ్య త్రైపాక్షిక చర్చల సంభావ్యతను కొట్టిపారేయలేం. ట్రంప్ దూత స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో రష్యా నాయకులతో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు అమెరికా వర్గాలు ధృవీకరించాయి. రానున్న రోజుల్లో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన తర్వాత, శాంతి చర్చలకు మార్గం సుగమం చేసే దిశగా త్రైపాక్షిక సమావేశం జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, జెలెన్‌స్కీతో ప్రత్యక్ష చర్చలకు తాను వ్యతిరేకం కాదని, అయితే కొన్ని షరతులు ఉంటాయని పుతిన్ కూడా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

ఫలించని గత చర్చలు.. ట్రంప్ మార్క్ శాంతి సాధ్యమేనా : గతంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. తమ భూభాగాలను వదులుకోవాలన్న రష్యా డిమాండ్‌కు ఉక్రెయిన్ అంగీకరించలేదు. “యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా” అని గతంలో శపథం చేసిన ట్రంప్, ఇప్పుడు తనదైన మార్కు దౌత్యంతో శాంతిని నెలకొల్పగలరా లేదా అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad