US-Russia Nuclear Standoff: అగ్రరాజ్యాల మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. ఈ మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు చేతల రూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం ఘాటుగా బదులివ్వడమే కాకుండా, ఏకంగా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించాలని ఆదేశించడం పెను కలకలం రేపుతోంది. ఇంతకు మెద్వెదేవ్ అన్నదేమిటి..? ట్రంప్ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణమేంటి..?
నిప్పు రాజేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు: ప్రస్తుత ఉద్రిక్తతలకు వారం రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే బీజం వేశాయి. భారత్, రష్యాలను “చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు” (Dead Economies) గా ఆయన అభివర్ణించారు. ఆ దేశాలపై కఠినమైన సుంకాలు, జరిమానాలు విధిస్తామని ప్రకటించడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ అయిన డిమిత్రి మెద్వెదేవ్, ట్రంప్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.
“డెడ్ ఎకానమీ” వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించిన మెద్వెదేవ్, ట్రంప్ “డెడ్ హ్యాండ్” వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. తమ దేశానికి ముప్పు వాటిల్లితే, మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండానే శత్రు దేశంపైకి ఆటోమేటిక్‌గా అణ్వాయుధాలను ప్రయోగించే అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థే ఈ “డెడ్ హ్యాండ్”. సోవియట్ యూనియన్ కాలంలో దీన్ని అభివృద్ధి చేశారు. తమ అణుశక్తిని పరోక్షంగా గుర్తు చేస్తూ మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
ALSO READ: https://teluguprabha.net/international-news/trump-india-russian-oil-trade-tariffs/
ట్రంప్ కౌంటర్ ఎటాక్: జలాంతర్గాముల మోహరింపు : మెద్వెదేవ్ వ్యాఖ్యలను “మూర్ఖపు, రెచ్చగొట్టేవి” అని అభివర్ణించిన ట్రంప్, మాటలతోనే సరిపెట్టలేదు. తమను అవి చర్యలకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. “పదాలు చాలా ముఖ్యం. కొన్నిసార్లు అవి ఊహించని పరిణామాలకు దారితీస్తాయి,” అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్‌సోషల్’లో పోస్ట్ చేసిన ట్రంప్, అందుకు తగ్గట్టే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా తీరానికి సమీపంలో రెండు శక్తివంతమైన అణు జలాంతర్గాములను తక్షణమే మోహరించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. మాటలకు చేతలకు కూడా తాము సిద్ధమేనని చెప్పడమే ఈ చర్యల ఉద్దేశమని స్పష్టమవుతోంది.
ALSO READ: https://teluguprabha.net/international-news/india-halts-f35-deal-us-russia-defense-relations/
రష్యా ధీటైన స్పందన: మా నిఘా నీడలోనే ఉన్నారు : ట్రంప్ ఆదేశాలపై రష్యా కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. రష్యా పార్లమెంట్ సభ్యుడు వోడోలాట్స్కీ స్పందిస్తూ, అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని స్పష్టం చేశారు. “మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే మావే చాలా ఎక్కువ. వారు మోహరించినవి మా జలాంతర్గాముల నియంత్రణలోనే ఉన్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం మాకు లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.


