Trump Seeks To Hold Trilateral Meet With Putin, Zelensky: ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగులు వేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అనంతరం, ఆగస్టు 22న పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీలతో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
అమెరికా మీడియా సంస్థ ‘యాక్సియోస్’ కథనం ప్రకారం, ఈ త్రైపాక్షిక సమావేశానికి యూరోపియన్ నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించారు. జెలెన్స్కీ శనివారం తన X పోస్ట్‌లో ట్రంప్‌తో సోమవారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నట్లు తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా ఈ త్రైపాక్షిక సమావేశం జెలెన్స్కీ-ట్రంప్ భేటీ తర్వాత ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రష్యా మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ALSO READ: Peace talks : అలస్కాలో ట్రంప్ – పుతిన్ కీలక భేటీ.. కాల్పుల విరమణ కాదు ఒప్పందమే మార్గం!
అలాస్కాలోని ఎల్మెండార్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరం వద్ద ఆగస్టు 15న పుతిన్, ట్రంప్‌ల మధ్య దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తర్వాత ట్రంప్ ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేలా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించినట్లు రష్యా వార్తా సంస్థ ‘టాస్’ పేర్కొంది. దీనికి బదులుగా మిగిలిన ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ, కీవ్ మరియు యూరప్‌లకు భద్రతా హామీలు లభిస్తాయని టాస్ నివేదించింది.
ALSO READ: Trump on India : పుతిన్‌తో భేటీకి ముందు.. రష్యా చమురు క్లయింట్‌గా భారత్ లేదన్న ట్రంప్!
పుతిన్‌తో చర్చలు ఆశాజనకంగా జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్స్కీతో సోమవారం జరిగే సమావేశం విజయవంతమైతే పుతిన్‌తో మరో సమావేశం ఏర్పాటు చేస్తానని ట్రంప్ చెప్పారు.


