Trump: ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తాము ఊరుకునేది లేదని అన్నారు. నేరుగా రక్షణ మంత్రిని రంగంలోకి దించి ఆ దేశం పని పడతామని హెచ్చరించారు. శ్వేతసౌధంలో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆ దేశం కోరడం వల్లే ఇరాన్‌కు చాన్స్!: ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్న ఈ చర్చల వెనుక పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో పాటు ఆ దేశ ప్రధాని ప్రత్యేకంగా అభ్యర్థించడం వల్లే ఇరాన్‌కు తాము ఈ చిన్న అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని తెలిపారు. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు అమెరికాతో ఎలాగైనా ఒప్పందం చేసుకోవాలని టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒమన్‌ను హెచ్చరించిన ట్రంప్: వ్యాపార, చమురు రవాణా పరంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వ్యవహారంలో ఒమన్ దేశానికి కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ అంశంలో ఒమన్ తమకు సహకరించకపోతే.. ఆ దేశాన్ని కూడా క్షిపణులతో పేల్చేస్తామని అన్నారు. అంతర్జాతీయ జలాలపై ఎవరి గుత్తాధిపత్యాన్ని సహించేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతున్నప్పటికీ.. ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే ఇరాన్-అమెరికా మధ్య ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read-USA Vs Iran: మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడ్డ యూఎస్ దళాలు!
హర్మూజ్ సమీపంలో బాంబుల వర్షం: అమెరికా ఓ వైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తూనే.. మరో వైపు దాడులు చేస్తోంది. తాజాగా హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. హర్మూజ్ ప్రాంతంలో తమ సైన్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందునే దాడులు నిర్వహించామని అమెరికా రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.

