Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చేశారు. తనని తాను శాంతి దూతగా పేర్కొన్న ఆయన.. ఇన్నాళ్లు తాను ఏడు యుద్ధాలు ఆపానంటూ ప్రచారం చేసుకన్నారు. కానీ, ఇప్పుడు ఈ విషయంలో మాట మార్చారు. స్వయంగా మూడు యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగానే ట్రంప్ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘మీకు తెలుసా.. నేను ఇప్పటి వరకు మూడు యుద్ధాలు ఆపా’ అని పేర్కొన్నారు. ఆయన ఏ యుద్ధాల గురించి చెప్పారో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే, ఆ దేశాలన్నీ మూడు దశాబ్దాలుగా సంఘర్షణల్లో ఉన్నాయన్నారు. ఆ యుద్ధాలు మీరు ఆపలేరని.. తనకు ప్రజలు చాలా సార్లు చెప్పారన్నారు. కానీ, వాటన్నింటినీ తాను ఆపగలిగానని పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రస్తుతం క్లిష్టతరంగా ఉందని, అయినా తాను దాన్ని ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: UNGA: ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ఐరాసలో భారత్ ఆందోళన
భారత్- పాక్ ఉద్రిక్తతలను ఆపినట్లు ప్రచారం
మరోవైపు, ఇటీవల పలు సందర్భాల్లో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే పేర్కొన్నారు. అయితే, భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. భారత్- పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశ ప్రమేయం లేదని ప్రధాని మోదీ కూడా స్పష్టం చేశారు. ఇక, థాయ్‌లాండ్ -కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, రవాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియాల మధ్య ఘర్షణలను ట్రంప్ ఆపారని శ్వేతసౌధం పలుమార్లు పేర్కొంది. ఈ క్రమంలో ఆయన పేరును కొందరు నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేశారు.
Read Also: Ajit Pawar: నీకెంత ధైర్యం? మహిళా అధికారికి మంత్రి బెదిరింపులు
ట్రంప్ విందు
అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈవోలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ తర్వాత ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి టిమ్‌కుక్, సుందర్ పిచాయ్, జుకర్‌బర్గ్, సత్యనాదెళ్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు. ‘‘టిమ్.. అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్లూ మీరు బయట (ఇతర దేశాల్లో) పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి. ఎంత పెట్టుబడి పెడతారు?’’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను ట్రంప్ అడిగారు. దీనికి టిమ్ బదులిస్తూ.. ‘600 బిలియన్ డాలర్లు’ అని చెప్పారు. ఆ వెంటనే మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను ట్రంప్ అడగ్గా.. ‘600 బిలియన్ డాలర్లు’ అని చెప్పారు. ‘రాబోయే రెండేళ్లలో 250 బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నాం’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఏటా 80 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల బదులిచ్చారు. దీంతో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా పెద్ద మొత్తం. అనేక ఉద్యోగాలు సృష్టించొచ్చు. ధన్యవాదాలు’’ అని టెక్ దిగ్గజాలను మెచ్చుకున్నారు.


