Donald Trump’s criticism of Indian trade policies : భారత్-అమెరికా వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఒకవైపు భారత్‌పై 50 శాతం అదనపు సుంకాలు విధించి కయ్యానికి కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోవైపు ఆ చర్యలను సమర్థించుకుంటూ భారత్‌పైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “భారత్‌తో మాది ఏకపక్ష ప్రేమే”నని, ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తూ అమెరికా తయారీదారుల నడ్డి విరుస్తోందని ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
భారత్‌పై ట్రంప్ విమర్శల వర్షం: వైట్‌హౌస్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, భారత వాణిజ్య విధానాలపై తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు.
ఏకపక్ష సంబంధం: “మేం భారత్‌తో చాలా బాగానే ఉంటున్నాం. కానీ, ఏళ్లుగా ఈ వాణిజ్య సంబంధం ఏకపక్షంగానే సాగుతోంది. భారత్ మా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించింది. కానీ, మేం వారి ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు వేయలేదు, అదే మేం చేసిన తప్పు,” అని ట్రంప్ అన్నారు.
అమెరికా తయారీదారులకు నష్టం: “భారత్ విధిస్తున్న 100 శాతం సుంకాల వల్ల అమెరికా కంపెనీలు తమ వస్తువులను భారత మార్కెట్‌లో అమ్మలేకపోతున్నాయి. కానీ, భారత్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా అమెరికాలో తమ ఉత్పత్తులను కుమ్మేస్తోంది. దీనివల్ల మా దేశంలో తయారీ రంగం దెబ్బతింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హార్లే డేవిడ్సన్ ఉదంతం: తన వాదనకు బలం చేకూర్చుతూ, ట్రంప్ హార్లే డేవిడ్సన్ మోటార్‌సైకిళ్ల ఉదంతాన్ని ప్రస్తావించారు. “హార్లే బైక్‌లపై భారత్ 200 శాతం సుంకం విధించింది. దీంతో వారు అక్కడ అమ్మకాలు చేయలేక, చివరికి భారత్‌లోనే ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది,” అని ఆయన గుర్తుచేశారు.
తగ్గేదేలే అంటున్న భారత్: ట్రంప్ బెదిరింపులకు, సుంకాలకు భారత్ ఏమాత్రం తలొగ్గేలా కనిపించడం లేదు. దేశీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం: “రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదు. దీని కోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా మేం సిద్ధం,” అని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ స్పష్టం చేశారు.
SCO సదస్సులోనూ అదే మాట: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌ల సమక్షంలో, దేశీయ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ తేల్చిచెప్పారు.
ఒకవైపు “అమెరికా ఫస్ట్” నినాదంతో ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలను అనుసరిస్తుంటే, మరోవైపు “మేకిన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాలతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ రెండు అగ్ర దేశాల ప్రయోజనాల మధ్య నలుగుతున్న వాణిజ్య సంబంధాలు, భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకుంటాయోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.


