అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా ? వద్దా ? అన్నదానిపై మస్క్ పోలింగ్ నిర్వహించగా.. 51.8 శాతం మంది యాక్టివేషన్ కు మద్దతిచ్చారని మస్క్ ట్వీట్ చేశారు. పోలింగ్ ను బట్టి.. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రీ యాక్టివేట్ చేస్తున్నట్లు చెబుతూ.. ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ అని అర్థం వచ్చే లాటిన్ పదాన్ని జోడించారు.
కానీ.. తనకు తిరిగి ట్విట్టర్లోకి వచ్చేందుకు ఆసక్తి లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. తనను నిషేధించిన ట్విట్టర్‌లోకి తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. తన సొంత మీడియా అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ట్విట్టర్ కంటే టీఎంటీజీ మెరుగ్గా పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ట్విట్టర్లోకి వస్తారా ? రారా? అన్నదానిపై సందిగ్ధం ఏర్పడింది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రమైన హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి.. విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ చేసిన ట్వీట్లు, పోస్టులేనని వార్తలు రావడంతో.. ఆయన ఖాతాలను తొలగిస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రకటించాయి. ట్విట్టర్ పగ్గాలు చేజిక్కించుకున్న వెంటనే మస్క్.. ట్రంప్ సహా నిషేధించబడిన పలువురి ఖాతాలను పరిశీలిస్తామని చెప్పారు.