Trump strong warning to Iran: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇరాన్‌కు తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు పంపిస్తున్నట్లు తెలిపారు. వీటిని భవిష్యత్తులో ఉపయోగించే అవసరం రావొద్దని తాను కోరుకుంటున్నట్లు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహకనౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్’ పశ్చిమాసియాకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధ నౌకల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మద్య ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచేశాయి. మరో యుద్ధనౌక ఇరాన్‌వైపు వెళ్తోందని.. వారు ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పటికే వారు తమతో ఒప్పందం చేసుకోవాల్సి ఉందని.. దీనికి వారు కూడా సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలుసన్నారు. వాళ్లు చాలాసార్లు తనకు ఫోన్ చేసి ఒప్పందం చేసుకునేందుకు సుముఖత చూపారన్నారు. అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఈ ప్రాంతం వైపు తరలిస్తున్నట్లు మరో అమెరికా అధికారి చెప్పారు.
అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే సహించం..
ఇదిలా ఉండగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్ వాహక నౌకతో పాటు మరికొన్ని యుద్ధ నౌకలను పశ్చిమాసియాలో అమెరికన్ దళాలు మోహరిస్తున్నాయి. దీంతో, ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైన దాడులు చేయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే జరిగితే, భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

