Reason behind Trump’s tariffs on India : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల వెనుక అసలు కారణం రష్యా నుంచి చమురు కొనుగోలేనా, లేక మరేదైనా వ్యక్తిగత కక్ష ఉందా..? ఈ ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చైనాతో రష్యాకు అంతకంటే పెద్ద వాణిజ్య సంబంధాలు ఉన్నా, కేవలం భారత్‌నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కోణం దాగి ఉందని ప్రముఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఘనతను తనకు దక్కనీయలేదన్న అక్కసుతోనే ట్రంప్ ఈ సుంకాల కొరడా ఝుళిపిస్తున్నారా..?
నిపుణుల వాదనలో నిజమెంత : ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాన్ని 25% నుంచి 50%కి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, త్వరలో ద్వితీయ స్థాయి ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గత రెండు దశాబ్దాలలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశ ఇదేనని ప్రముఖ థింక్ ట్యాంక్ ‘విల్సన్ సెంటర్’ దక్షిణాసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ అభిప్రాయపడ్డారు.
అసలు కారణం ‘క్రెడిట్’ రాజకీయమా : రష్యా నుంచి చమురు కొనుగోలు అనే కారణం పైకి కనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక మరో బలమైన కారణం ఉందని కుగెల్మాన్ వంటి నిపుణులు భావిస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం..
కాల్పుల విరమణ క్రెడిట్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో తన మధ్యవర్తిత్వం ఉందని ట్రంప్ పదేపదే చెప్పుకున్నారు. దాదాపు 20 సార్లకు పైగా తానే ఆ ఘనత సాధించానని ప్రకటించారు.
భారత్ ఖండన: అయితే, ఈ కాల్పుల విరమణలో ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేదని, అది కేవలం ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందమని భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. ట్రంప్ వాదనను సున్నితంగానే అయినా, గట్టిగా తిరస్కరించింది.
ట్రంప్ ఆగ్రహం: ఈ క్రెడిట్‌ను తనకు దక్కనీయలేదన్న తీవ్ర ఆగ్రహం, మనస్తాపం ట్రంప్‌లో ఉందని, ఆ అక్కసును ఇప్పుడు వాణిజ్యం, సుంకాల రూపంలో భారత్‌పై చూపిస్తున్నారని కుగెల్మాన్ అభిప్రాయపడ్డారు. “చైనాతో ఇలాంటి వ్యక్తిగత మనస్ఫర్థలు రాలేదు. అందుకే ట్రంప్ తన ఆగ్రహాన్ని భారత్‌పైనే కేంద్రీకరించారు. ఇది స్పష్టమైన ద్వంద్వ ప్రమాణం” అని ఆయన పేర్కొన్నారు.
భారత్ దీటైన స్పందన: మరోవైపు, అమెరికా విధించిన అదనపు సుంకాలు ఏ మాత్రం సహేతుకం కావని భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది “అనుచితం, అన్యాయం” అని పేర్కొంది.దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని విదేశాంగ శాఖ గట్టిగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరోక్షంగా స్పందిస్తూ, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని గట్టి సంకేతాలిచ్చారు. ఏదేమైనా, ఓ రాజకీయ ‘క్రెడిట్’ వివాదం, రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధంగా మారడం ఆందోళన కలిగించే పరిణామం.


