Trump Tariff Deadline For Russia: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు షాకింగ్ వార్నింగ్..! ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని 50 రోజుల్లోగా నిలిపివేయకపోతే, ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి..? ఈ సుంకాల అమలు తీరు ఎలా ఉండబోతోంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన వైఖరిని మరింత స్పష్టం చేశారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుతిన్ పగలు మృదువుగా మాట్లాడినా, రాత్రిపూట బాంబులు కురిపిస్తారని, ఆయన ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చడం లేదని ఆవేశంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ట్రంప్ విధానంలో మార్పు : యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ట్రంప్ ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. సమావేశంలో, ఉక్రెయిన్ గగనతల రక్షణను పటిష్టం చేయడం, కలిసి ఆయుధాలు తయారు చేయడం, అమెరికా నుంచి ఆయుధాలు కొనడం, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలను మరింత కఠినతరం చేయడం వంటి ముఖ్యమైన విషయాలపై చర్చించారు. జెలెన్‌స్కీ స్వయంగా ఈ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించడం గమనార్హం. ఇది ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్‌కు మరింత మద్దతు లభించే అవకాశం ఉందని సూచిస్తుంది.
రష్యాకు సాయం చేస్తే అంతే సంగతులు : రష్యాకు ఏ దేశమైనా సాయం చేస్తే వాటిపై ఏకంగా 500 శాతం టారిఫ్‌లు విధించేలా ఒక బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ప్రకటించారు. ఇది రష్యా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికగా మారింది. అంతేకాదు, ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకరించారని, రికార్డు స్థాయిలో ఆయుధాలతో పాటు, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్‌కు పంపనున్నారని గ్రాహం వెల్లడించారు. స్వయంగా ట్రంప్ కూడా ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్‌కు అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.
వాణిజ్యంతో యుద్ధాలకు చెక్: దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపివేయడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు ఇది చాలా గొప్పగా ఉంటుందని, గతంలో భారత్-పాకిస్తాన్ ఘర్షణల గురించి ప్రస్తావించారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను తాను వాణిజ్య ఒప్పందాలతో ముడిపెట్టి ఆపగలిగానని ఆయన పేర్కొన్నారు. అంటే, భవిష్యత్తులో ట్రంప్ అధికారంలోకి వస్తే, అమెరికా విదేశాంగ విధానంలో వాణిజ్యం కీలక పాత్ర పోషించనుందని అర్థమవుతోంది.
Trump Ultimatum: 50 రోజుల్లో యుద్ధం ఆపు.. లేదంటే..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


