Trump’s warning to Israel : “వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తే, అమెరికా నుంచి మీకు లభించే పూర్తి మద్దతును కోల్పోతారు!” – ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు, ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు తాను కృషి చేస్తుంటే, ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయాలతో దానికి గండి కొట్టాలని చూస్తోందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అసలు ట్రంప్ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణమేంటి? దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి..?
‘టైమ్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ విధానాలపై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
వివాదాస్పద బిల్లులు: ఇజ్రాయెల్ పార్లమెంటు (నెస్సెట్)లో ఇటీవల ప్రవేశపెట్టిన రెండు బిల్లులే ఈ వివాదానికి మూలం. ఈ బిల్లులు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో కొత్త యూదు కాలనీల ఏర్పాటుకు, ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ పూర్తి ఆధిపత్యానికి మార్గం సుగమం చేస్తాయని పాలస్తీనాతో పాటు, అనేక అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రంప్ హెచ్చరిక: ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ, “వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోనివ్వం. నేను అరబ్ దేశాలకు మాట ఇచ్చాను. ఇజ్రాయెల్ ఆ నిర్ణయం తీసుకుంటే, వారికి అమెరికా నుంచి అందే మద్దతు పూర్తిగా ఆగిపోతుంది,” అని తీవ్రంగా హెచ్చరించారు.
అమెరికాలో ఏకాభిప్రాయం : ఈ విషయంలో ట్రంప్ ఒంటరి కారు. ఆయన ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ వైఖరిని తప్పుబడుతున్నారు.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్: “అది తెలివితక్కువ చర్య. అమెరికా, అరబ్ దేశాల మధ్య సున్నిత సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం. వ్యక్తిగతంగా నేను దీనిని అవమానంగా భావిస్తున్నాను,” అని ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనలో ఆయన వ్యాఖ్యానించారు.
విదేశాంగ మంత్రి మార్కో రుబియో: ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ఆయన కూడా, “ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంతీయ శాంతిని ప్రమాదంలోకి నెడతాయి,” అని హెచ్చరించారు.
‘అబ్రహం ఒప్పందం’ భవితవ్యం : తన అధ్యక్ష హయాంలోనే ఇజ్రాయెల్, యూఏఈ, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాల మధ్య చారిత్రక ‘అబ్రహం ఒప్పందం’ కుదిరిందని, ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఈ శాంతి ఒప్పందంలో చేరనుందని ట్రంప్ గుర్తుచేశారు.
“మధ్యప్రాచ్యంలో శాంతి సాధ్యమే, కానీ దానికి ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి,” అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తాజా హెచ్చరికలు, అంతర్గత రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచనున్నాయి. అమెరికా మద్దతు లేకుండా ముందుకెళ్లడం ఇజ్రాయెల్‌కు కత్తిమీద సామేనని విశ్లేషకులు భావిస్తున్నారు.


