Trump’s tariff threat on India : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మాటల తూటాలు పేల్చారు. భారత వాణిజ్య విధానాలపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కిన ఆయన, 24 గంటల వ్యవధిలో అధిక సుంకాలు విధిస్తామని కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే దీనికి కారణమని కుండబద్దలు కొట్టారు. ఇంతకీ ట్రంప్ ఆరోపణల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఈ బెదిరింపులకు భారత్ తలొగ్గుతుందా…? లేక తనదైన శైలిలో దీటుగా బదులిస్తుందా..?
అసలేం జరిగింది : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. వాణిజ్య విషయంలో భారత్ సరైన భాగస్వామి కాదని, తమతో భారీగా వ్యాపారం చేస్తూ అందుకు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలున్నాయని, రాబోయే 24 గంటల్లో వీటిని గణనీయంగా పెంచనున్నామని స్పష్టం చేశారు. “రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. తద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం వాణిజ్యపరమైన హెచ్చరిక మాత్రమే కాదు, అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా ఒత్తిడి.. భారత్ దీటైన జవాబు : ఉక్రెయిన్‌పై రషయా సైనిక చర్య నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా రష్యా నుంచి చౌకగా లభించే చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చర్యను అమెరికా చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చింది. కానీ, భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాలను గట్టిగా తిప్పికొట్టింది. అణు పరిశ్రమ, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అమెరికానే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని భారత్ అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నించింది. దీంతో అమెరికా వాదనల్లోని డొల్లతనం బయటపడింది.
రంగంలోకి రష్యా.. అమెరికాపై ధ్వజం : భారత్‌పై ట్రంప్ చేసిన సుంకాల బెదిరింపులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా అనుసరిస్తున్న అక్రమ వాణిజ్య ఒత్తిడి అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మండిపడ్డారు. సార్వభౌమ దేశాలు తమ వాణిజ్య భాగస్వాములను స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “ఉక్రెయిన్ యుద్ధంపై నిర్ణయం తీసుకోనందుకు, మాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఇతర దేశాలను అమెరికా బెదిరిస్తోంది. ఇది చట్టవిరుద్ధం” అని పెస్కోవ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ వేదికపై తమ ఆధిపత్యం క్షీణిస్తుండటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా విమర్శించారు. ఆధునిక వలసవాదాన్ని అనుసరిస్తూ, తమ మాట వినని దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తెస్తోందని ఆమె ఆరోపించారు. గ్లోబల్ సౌత్ (ఆర్థికంగా వెనుకబడిన దేశాలు) దేశాల సార్వభౌమాధికారంలో, అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.


