Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump Tariffs on Canada : కెనడాపై ట్రంప్ 35% టారిఫ్..డీలాపడిన డాలర్!

Trump Tariffs on Canada : కెనడాపై ట్రంప్ 35% టారిఫ్..డీలాపడిన డాలర్!

US-Canada Tariff Dispute: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. “అమెరికా ఫస్ట్” నినాదంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు దేశాలపై సుంకాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్న ట్రంప్, ఇప్పుడు పొరుగు దేశం కెనడాపై ఏకంగా 35 శాతం భారీ సుంకాన్ని విధించి శ్వేతసౌధ వర్గాల్లోనే కాదు, ప్రపంచ ఆర్థిక నిపుణుల్లోనూ కలకలం రేపారు. ఈ అనూహ్య నిర్ణయంతో కెనడా డాలర్ విలువ పడిపోగా, అమెరికా మార్కెట్లు సైతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. అసలు ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి..? 

- Advertisement -

ట్రంప్ సుంకాల బాంబు: కెనడాపై 35% పెంపు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు షాకిస్తూ, దిగుమతులపై 35 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ కెనడా ప్రధాని మార్క్ కార్నీకి లేఖ ద్వారా తెలియజేయడమే కాకుండా, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లోనూ పంచుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కెనడా డాలర్ విలువ 0.4 శాతం పడిపోగా, ఎస్&పీ ఫ్యూచర్ స్టాక్స్ 0.5 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామాలు ట్రంప్ నిర్ణయం తక్షణమే మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టం చేస్తున్నాయి.

ఫెంటనిల్ ఆరోపణలు, పాల ఉత్పత్తుల పేచీ:  ట్రంప్ తన లేఖలో ఈ భారీ సుంకాల వెనుక గల ప్రధాన కారణాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా, అమెరికాలోకి ఫెంటనిల్ మత్తు పదార్థాలు అక్రమ రవాణా కెనడా ద్వారా ఎక్కువగా జరుగుతోందని, దీనిని కట్టడి చేయడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అమెరికా జాతీయ భద్రతకు, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

మరో కీలకమైన అంశం ఏమిటంటే, అమెరికా డెయిరీ ఉత్పత్తులపై కెనడా ఏకంగా 400 శాతం వరకు అధిక టారిఫ్ వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, దీనిని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వాణిజ్య లోటును తగ్గించుకోవడం, అమెరికా పరిశ్రమలను రక్షించుకోవడమే తన లక్ష్యమని ట్రంప్ తన లేఖలో పునరుద్ఘాటించారు. 2025 ఆగస్టు 1 నుండి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.

ప్రతిదాడుల హెచ్చరికలు: వాణిజ్య యుద్ధం ముదురుతుందా : ట్రంప్ తన హెచ్చరికలను మరింత తీవ్రతరం చేశారు. ఒకవేళ కెనడా కూడా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు పెంచితే, తమ ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితిలో అమెరికా మరింతగా టారిఫ్ రేట్లను పెంచుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో అమెరికా-కెనడా మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి.

ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ కన్ను: కెనడా ఒక్కటే కాదు, ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. బ్రెజిల్ దిగుమతులపై అత్యధికంగా 50 శాతం టారిఫ్ విధిస్తామని ఆయన ప్రకటించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై నడుస్తున్న కేసును అమెరికా తప్పుబట్టడం, దానికి వ్యతిరేకంగా ట్రంప్ సుంకాలను పెంచడం గమనార్హం.

అలాగే, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, కజాకిస్థాన్, దక్షిణాఫ్రికా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ట్యునీషియా, బోస్నియా, హర్జెగొవినా, సెర్బియా, కంబోడియా, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, మోల్డోవా, బ్రునై, ఫిలిప్పీన్స్‌ సహా పలు దేశాలపై ట్రంప్ ఇప్పటికే టారిఫ్‌లను ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆగస్టు 1 నుండి పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.

కెనడా ప్రత్యామ్నాయాలు: ట్రంప్ నిర్ణయంతో కెనడాలోని పరిశ్రమలు ఇతర మార్కెట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు తమ మార్కెట్ విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సుంకాలు పెంచిన నేపథ్యంలో అమెరికాతో చర్చించాలని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను చక్కదిద్దుకోవడానికి దౌత్య మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad