వరుసగా వచ్చిన భూకంపాల ధాటికి సిరియా, టర్కీల్లో మృతుల సంఖ్య 5,000 దాటింది. కాగా శిథిలాల కింది ఇంకా చాలామంది బాధితులు ఉన్నట్టు గుర్తిస్తున్నారు. సహాయక చర్యలు, పునరావాస చర్యలు వేగవంతంగా సాగేందుకు ఇంకా సమయం పడుతుంది. యుద్ధం, అంతర్యుద్ధం, శరణార్థులతో ఎప్పుడో చితికిపోయిన సిరియాలో మిన్నంటుతున్న ఆర్తనాదాలు, చావుకేకలు దారుణమైన పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.
భూకంపం దెబ్బకు మూ డు నెలలపాటు టర్కీలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు టర్కీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. గత 48 గంటల్లో 5 భారీ భూకంపాలు వచ్చిన సిరియా-టర్కీలో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మరోవైపు వణికించే చలితో, తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. ఇరు దేశాల్లోనూ గాయపడ్డ వారి సంఖ్య 10,000 దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టర్కీలోని 10 రాష్ట్రాలు భూకంపానికి వణికిపోయాయి. ఇక్కడ ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఇప్పటికే సాయం చేసేందుకు మేమున్నామంటూ భారత్ తో సహా 70 ప్రపంచ దేశాలు ముందుకు వచ్చినట్టు టర్కీ వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం కనీసం 20,000 మంది మృత్యువాత పడి ఉండచ్చని, సహాయక చర్యలు ఆలస్యం అయ్యేకొద్దీ గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. కాగా ఈ భారీ భూకంపం ధాటికి 23 మిలియన్ల మంది జీవితాలు బుగ్గిపాలయ్యాయని WHO అంటోంది. వైద్యారోగ్యం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇండిగో ఎయిర్ లైన్స్ ఉచితంగా భారత్ నుంచి ఇస్తాంబుల్ కు కార్గో ఫ్లైట్ సర్వీసులు అందజేస్తామని వెల్లడించింది. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు 101 మందితో టర్కీకి వెళ్లింది. వీరితో పాటు రెండు కుక్కలు, 4 వాహనాలు, కటింగ్ టూల్స్, ఫస్ట్ ఎయిడ్, మందులు, కమ్యూనికేషన్ సెటప్స్ అన్నీ తీసుకెళ్లారు.