టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. టర్కీ దేశంలోని పలు నగరాల్లో భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 100కు చేరగా శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాల కోసం వెతుకులాట సాగుతోంది. అందరూ నిద్రలో ఉండగా భూకంపం సంభవించటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలున్నట్టు టర్కీ దేశాధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని వీధుల్లో పరిగెత్తారు. భూకంపం తరువాత కూడా భూమి 15 నిమిషాలపాటు అలాగే కంపిస్తూ ఉండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
టర్కీ భూకంప ధాటికి పొరుగునే ఉన్న సిరియాలోనూ భూమి కంపించింది. సిరియాలో మృతుల సంఖ్య 42 కు చేరింది. ఆస్తి నష్టం సంభవించింది. లెబనాన్, సైప్రస్ లోనూ భూమి కంపించింది.