Homeఇంటర్నేషనల్Nepal:నేపాల్ జలప్రళయం -10 రోజుల తర్వాత సజీవంగా ఇద్దరు

Nepal:నేపాల్ జలప్రళయం -10 రోజుల తర్వాత సజీవంగా ఇద్దరు

ప్రాణాలతో బైటపడిన మహిళ.. చైనా కార్మికుడు
ఇప్పటివరకు 1,300 మంది మృతి, 5,000 మంది గల్లంతు
మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షల తర్వాత సామూహిక అంత్యక్రియలు

- Advertisement -

కాఠ్‌మాండు,  (తెలుగుప్రభ): వరదలు, కొండచరియలతో అతలాకుతలమైన నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ మరో ఇద్దరు వ్యక్తులను సజీవంగా రక్షించారు. రోజుల తరబడి శిథిలాలు, మట్టి కింద చిక్కుకున్న చైనా కార్మికుడితో పాటు 64 ఏళ్ల మహిళను రక్షణ బృందాలు ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,300 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

225 మీటర్ల సొరంగం నుంచి చైనా కార్మికుడు

హైడ్రోపవర్ ప్రాజెక్టుకు అనుసంధానమైన సొరంగంలో చిక్కుకున్న చైనా పౌరుడు లుహైటావోను సజీవంగా రక్షించారు. నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు సహాయక నిపుణులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 225 మీటర్ల పొడవైన సొరంగం నుంచి లుహైటావోను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షల కోసం తరలించారు. రక్షణ సమయంలో తీసిన చిత్రాల్లో.. మట్టితో నిండిన చేతులతో ఉన్న లుహైటావోను ఇద్దరు రక్షణ సిబ్బంది సాయంతో బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు కనిపించాయి. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఇది మూడో విజయవంతమైన రక్షణ ఆపరేషన్.

శిథిలమైన ఇంటి నుంచి 64 ఏళ్ల మహిళ

నువాకోట్ ప్రాంతంలో శిథిలమైన ఇంట్లో చిక్కుకున్న 64 ఏళ్ల చండికా శ్రేష్ఠను కూడా సజీవంగా రక్షించారు. మట్టి, శిథిలాల మధ్య ఆమెను గుర్తించిన రక్షణ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వైద్య చికిత్స కోసం ఆమెను ఖాట్మండుకు హెలికాప్టర్‌లో తరలించారు. రక్షణ సిబ్బంది ఆమెను బూడిద రంగు దుప్పటిలో చుట్టి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు వెలువడ్డాయి.

ఇంకా వందల మంది సొరంగాల్లోనే?

నేపాల్‌లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన దాదాపు 900 మంది కార్మికులు ఇంకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో సుమారు 500 మంది వివిధ సొరంగాల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు కూడా నేపాల్‌ సహాయక బృందాలతో కలిసి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. డీఎన్‌ఏ నమూనాలు సేకరించిన అనంతరం 1,030 మృతదేహాలను సామూహిక సమాధుల్లో ఖననం చేసినట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు. విపత్తు కారణంగా నిరాశ్రయులైన వేలాది మందికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పిస్తామని ప్రధాని బాలేంద్ర షా హామీ ఇచ్చారు. తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఉంటున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు మళ్లీ తమ జీవితాలను నిర్మించుకునే పరిస్థితులు కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News