Friday, December 12, 2025
Homeఇంటర్నేషనల్UAE Visa Ban: పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్.. భిక్షాటన, నేరాల కారణంగా వీసాల జారీ...

UAE Visa Ban: పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్.. భిక్షాటన, నేరాల కారణంగా వీసాల జారీ బంద్!

UAE Halts Visas for Pakistanis Over Rising Concerns of Begging: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాకిస్థాన్ పౌరులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉపాధి కోసం, పర్యాటకం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే పాకిస్థాన్ (Pakistan) పౌరులు అక్కడ భిక్షాటన (Begging), ఇతర నేర కార్యకలాపాల్లో (Criminal Activities) పాల్గొంటున్నారన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వీసాల జారీని దాదాపుగా నిలిపివేసింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పాకిస్థాన్ పరువును బజారున పడేయడమే కాకుండా, ఆ దేశ పౌరులను తీవ్ర ఆందోళనలో పడేసింది.

- Advertisement -

పాకిస్థాన్ సెనేట్ మానవ హక్కుల కమిటీ సమావేశంలో అదనపు హోం శాఖ కార్యదర్శి సల్మాన్ చౌదరి ఈ చేదు నిజాన్ని ధృవీకరించారు. “దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు చేరుకున్న తర్వాత మన దేశస్తులు నేరాలకు పాల్పడుతున్నారని యూఏఈ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే వీసాలు ఇవ్వడం ఆపేసింది. ఒక్కసారి ఈ నిషేధం అధికారికంగా, పూర్తి స్థాయిలో అమలైతే.. దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం,” అని ఆయన హెచ్చరించారు.

ALSO READ: Thailand Floods: వరద గుప్పిట్లో థాయ్‌లాండ్.. 80 దాటిన మృతుల సంఖ్య

అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉపాధి కోసం వచ్చే “వర్క్ వీసా” వాళ్ళతో కాకుండా, కేవలం “సందర్శకుల వీసా” (Visit Visa) మీద అక్కడికి వెళ్తున్న చాలామంది పాకిస్థానీయులతోనే చిక్కు వచ్చి పడింది. వీరు అక్కడ దిగగానే పర్యాటక ప్రదేశాల్లో, మసీదుల వద్ద భిక్షాటన చేయడం మొదలుపెడుతున్నారు. ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోటర్ ఐసమ్ బేగ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. “విజిట్ వీసా మీద వెళ్ళేవారే ఎక్కువగా భిక్షాటనకు దిగుతున్నారు, ఇదే యూఏఈ ఆగ్రహానికి ప్రధాన కారణం,” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం దౌత్యవేత్తలకు, అధికారిక బ్లూ పాస్‌పోర్ట్ ఉన్నవారికి మాత్రమే అతి కష్టం మీద వీసాలు లభిస్తున్నాయి.

గల్ఫ్ దేశాలు పాకిస్థానీయులకు ప్రధాన గమ్యస్థానాలు. ప్రతి ఏటా దాదాపు 8 లక్షల మందికి పైగా అక్కడ ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే, గత డిసెంబర్ (2024) నుండే పరిస్థితి విషమించింది. పాకిస్థాన్‌లోని సుమారు 30 నగరాల వాళ్ళకు వీసాలు ఇవ్వకూడదని యూఏఈ, సౌదీ అరేబియా ముందే నిర్ణయించాయి. స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో పాకిస్థానీయుల ప్రమేయం పెరగడమే ఇందుకు కారణం. వీసా కావాలంటే పోలీసుల నుండి ‘ప్రవర్తన ధృవీకరణ పత్రం’ (Character Certificate) తేవాలని గతంలో నిబంధన పెట్టినా ఫలితం లేకపోయింది.

ప్రముఖ పాకిస్థానీ యూట్యూబర్ నాదిర్ అలీ కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. “నేను ఐఫా (IIFA) అవార్డుల కోసం వెళ్లాలనుకున్నప్పుడు వీసా దొరకక నానా ఇబ్బందులు పడ్డాను. భిక్షాటన చేస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో సౌదీ అరేబియా కూడా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది,” అని ఆయన వాపోయారు. పాకిస్థాన్‌కు వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన యూఏఈ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరింత దెబ్బ కొట్టే అవకాశం ఉంది.

ALSO READ: Hong Kong Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 94 మంది మృతి.. భవనాల నిండా మృతదేహాలు, ఇంకా దొరకని ఆచూకీ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News