Uganda social media ban : ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి.. రోజుల తరబడి మూతపడిన ఇంటర్నెట్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. కానీ, సామాజిక మాధ్యమాలపై మాత్రం ఉక్కుపాదం కొనసాగుతోంది! ఉగాండాలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ఈ వింత నిర్ణయం, ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీర్ఘకాల పాలకుడు యోవేరి ముసెవేని మరోసారి విజయం సాధించిన వేళ, ఇంటర్నెట్‌ను పునరుద్ధరించి, సోషల్ మీడియాపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.
ఉగాండాలో జనవరి 15న జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.
ఎన్నికల ముందు షట్‌డౌన్: ఎన్నికలకు రెండు రోజుల ముందు, “తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే” ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వ చర్యను ఐక్యరాజ్యసమితి “తీవ్ర ఆందోళనకరం”గా అభివర్ణించింది.
ముసెవేని విజయం, ఇంటర్నెట్ పునరుద్ధరణ: ఎన్నికల ఫలితాలు వెలువడి, ప్రస్తుత అధ్యక్షుడు యోవేరి ముసెవేని మరోసారి గెలిచినట్లు ప్రకటించిన కొద్ది గంటలకే, ఆదివారం ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పునరుద్ధరించింది.
సోషల్ మీడియాపై మాత్రం నిషేధం ఎందుకు : ఇంటర్నెట్‌ను పునరుద్ధరించినప్పటికీ, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరగవచ్చని, అందుకే ఈ నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను, విమర్శలను అణచివేయడానికే ప్రభుత్వం ఈ ‘డిజిటల్ సంకెళ్లు’ వేస్తోందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, రాజధాని కంపా లాలో పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మోహరించిన భద్రతా బలగాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలు తమ పనుల కోసం వీధుల్లోకి వస్తున్నారు, దుకాణాలు తెరుచుకుంటున్నాయి. అయినప్పటికీ, సోషల్ మీడియాపై నిషేధం కొనసాగుతుండటం, ఓ రకమైన అప్రకటిత నియంత్రణ వాతావరణాన్ని తలపిస్తోంది. ప్రభుత్వం గెలిచినా, ప్రజల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

