Teen Gets 1 Year Jail For Torture, Killing Of 2 Kittens: పిల్లి పిల్లలను అత్యంత క్రూరంగా హింసించి చంపిన ఒక టీనేజ్ బాలుడికి యూకే కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. లండన్‌లోని ఒక పార్కులో మే నెలలో రెండు పిల్లి పిల్లలను అత్యంత దారుణంగా హింసించి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా, లండన్ హైబరీ కోర్టు జడ్జి హినా రాయ్ మాట్లాడుతూ, జంతువులపై ఇంత దారుణమైన నేరాన్ని తాను తన జీవితంలో చూడలేదని అన్నారు.
17 ఏళ్ల బాలికతో కలిసి..
ఈ ఘటన మే నెలలో లండన్‌లోని నార్త్‌వెస్ట్‌లో జరిగింది. పోలీసులు పార్కులో దర్యాప్తు చేస్తున్నప్పుడు, పిల్లి పిల్లలను కత్తితో కోసి, వాటికి తాడులు కట్టి ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా, వాటి శరీరాలపై కొన్ని చోట్ల మాంసం, కాలిన గుర్తులు ఉన్నాయి. ఘటనా స్థలంలో కత్తులు, కత్తెరలు కూడా లభ్యమయ్యాయి. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడితో పాటు మరో 17 ఏళ్ల బాలిక కూడా నిందితులుగా ఉన్నారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. అయితే, బాలికకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు.
ఎవరినైనా చంపాలనే బలమైన కోరికతో..
దర్యాప్తులో భాగంగా, బాలుడి ఫోన్‌లో కొన్ని నోట్స్ లభించాయి. వాటిలో అతను “నేను ఎవరినైనా చంపాలనుకుంటున్నాను. ఎలాగైనా హత్య చేసి తప్పించుకోవడం ఎలా అని రోజూ వెతుకుతున్నాను. నాలోని కోపాన్ని తగ్గించుకోవడానికి పిల్లి పిల్లలను చంపాను” అని రాసుకున్నాడు.
ఈ ఘోరమైన చర్య వెనుక చాలా ప్రణాళిక ఉందని కోర్టు నిర్ధారించింది. ఇదివరకే నిందితుడు మానసిక సమస్యలు, డిప్రెషన్, యాంగ్జయిటీతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును అంతర్జాతీయంగా జంతువులను హింసించే వారి నెట్‌వర్క్‌తో సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


