Ukraine Drones Strike Russian Nuclear Plant: ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, రష్యాలోని పశ్చిమ కుర్స్క్ ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్‌ల దాడి చేసిందని రష్యా ఆరోపించింది. రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో అనేక విద్యుత్, ఇంధన సౌకర్యాలు లక్ష్యంగా చేసుకున్నాయని రష్యా అధికారులు తెలిపారు. అణు కేంద్రంలో చెలరేగిన మంటలను వెంటనే ఆర్పివేశారని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ ప్లాంట్ ప్రెస్ సర్వీస్ టెలిగ్రామ్‌లో పేర్కొంది. దాడిలో ఒక ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నప్పటికీ, రేడియేషన్ స్థాయిలు సాధారణ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు.
ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ వెంటనే స్పందించలేదు. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం, ఆదివారం రాత్రి సమయంలో తమ భూభాగంపైకి వచ్చిన 95 ఉక్రెయిన్ డ్రోన్‌లను తమ వైమానిక దళాలు అడ్డుకున్నాయని పేర్కొంది.
మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం..
ఈ ఘటనలు ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగాయి, ఈ రోజున ఉక్రెయిన్ 1991లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్య్రం పొందింది. కీవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ నుండి వీడియో సందేశంలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ, “మా భవిష్యత్తు ఎలా ఉండాలో మేము మాత్రమే నిర్ణయిస్తాం” అని అన్నారు.
ALSO READ: SCO summit: అమెరికాతో వాణిజ్య యుద్ధం.. చైనాకు మోడీ..!
ఈ సందర్బంగా, నార్వే దాదాపు 7 బిలియన్ క్రోనర్ ($695 మిలియన్) విలువైన కొత్త సైనిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీవ్‌లో జెలెన్‌స్కీని కలిశారు. పోప్ లియో XIV కూడా ఉక్రెయిన్ ప్రజల కోసం శాంతి కోసం ప్రార్థనలు చేశారు.


