Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Zelenskyy Trump : అగ్రరాజ్యంతో అస్త్రశస్త్రాలు.. రూ.7లక్షల కోట్ల డీల్‌కు జెలెన్‌స్కీ జై!

Zelenskyy Trump : అగ్రరాజ్యంతో అస్త్రశస్త్రాలు.. రూ.7లక్షల కోట్ల డీల్‌కు జెలెన్‌స్కీ జై!

Ukraine US arms deal : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీవ్ సేనలకు అండగా నిలుస్తున్న అమెరికా, ఇప్పుడు ఏకంగా రూ.7.85 లక్షల కోట్ల (90 బిలియన్ డాలర్లు) విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అమ్మేందుకు సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కారణమేంటి..? భద్రతా హామీల పేరిట అగ్రరాజ్యం పెడుతున్న షరతులేమిటి..? ఈ పరిణామం యుద్ధగతిని ఎలా మార్చబోతోంది..?

- Advertisement -

అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  ఐరోపా దేశాల నేతలతో భేటీ అనంతరం సంచలన ప్రకటన చేశారు. అమెరికా నుంచి 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ధ్రువీకరించారు. వారం, పది రోజుల్లోగా దీనిపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుందని తెలిపారు. తమ దేశానికి అమెరికా ఇస్తున్న భద్రతా హామీలకు ప్రతిఫలంగానే ఈ భారీ కొనుగోలుకు సిద్ధమైనట్లు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను ఐరోపా దేశాలు తమకు అందించే సహాయం నుంచి వినియోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

శాంతి చర్చలకు సిద్ధం.. కానీ : ఈ సందర్భంగా జెలెన్‌స్కీ శాంతి చర్చల అంశాన్ని కూడా ప్రస్తావించారు. తాను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరగాల్సిన త్రైపాక్షిక సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. అటువంటి సమావేశం జరిగితే హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. శాంతి స్థాపన కోసం జరిగే ఏ ప్రయత్నాన్ని ఉక్రెయిన్ అడ్డుకోదనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే, చర్చలు ఏ పద్ధతిలో జరిగినా అవి కేవలం దేశాధినేతల స్థాయిలోనే జరగాలని ఆయన షరతు విధించారు.

ట్రంప్‌తో సుదీర్ఘ మంతనాలు : వాషింగ్టన్‌లో జరిగిన సంప్రదింపులు అత్యంత ఫలప్రదంగా సాగాయని జెలెన్‌స్కీ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. “అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. రష్యా దురాక్రమణ, శాంతి స్థాపన ప్రయత్నాలు, మా దేశానికి భద్రతా హామీలు వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భద్రతా హామీలు ఇవ్వడానికి ట్రంప్ సానుకూలత వ్యక్తం చేశారు. ఇది యుద్ధాన్ని ఆపే దిశగా కీలకమైన తొలి అడుగు” అని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెరలో ఉన్న తమ దేశ పౌరులు, చిన్నారులు, యుద్ధ ఖైదీల విడుదల అంశంపై కూడా ప్రధానంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

మెలానియా ట్రంప్‌కు ప్రత్యేక ధన్యవాదాలు : ఈ సందర్భంగా జెలెన్‌స్కీ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రష్యా కిడ్నాప్ చేసిన దాదాపు 20 వేల మంది ఉక్రెయిన్ చిన్నారుల విడుదల కోసం చొరవ చూపి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు శాంతి లేఖ రాసినందుకు ఆమెను ప్రశంసించారు. “ఒక తల్లిగా, మానవతావాదిగా మెలానియా చూపిన చొరవ మా లక్ష్యానికి బలాన్నిచ్చింది. ఇది ఒక మానవతా విపత్తు. బలమైన మిత్రదేశాల సహకారంతో రష్యా చెర నుంచి మా ప్రతి బిడ్డను, ప్రతి పౌరుడిని విడిపించుకుంటాం” అని జెలెన్‌స్కీ ఉద్వేగంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad