Crypto Trader Found Dead Amid $19 Billion Market Crash: ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ క్రిప్టో కరెన్సీ ట్రేడర్, ఇన్‌ఫ్లుయెన్సర్ కాన్‌స్టాంటిన్ గాలిచ్ (కోస్టియా కుడోగా ప్రసిద్ధుడు) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అక్టోబర్ 11న కీవ్‌లోని ఒబొలాన్స్‌కీ జిల్లాలో అతని స్వంత లంబోర్గినీ ఉరుస్ (Lamborghini Urus) కారులో తలకు బుల్లెట్ గాయంతో మృతదేహం లభ్యమైంది.
సంఘటనా స్థలంలో అతనికి రిజిస్టర్ అయిన తుపాకీని పోలీసులు కనుగొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు బంధువులకు మెసేజ్ పంపిన నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మార్కెట్ క్రాష్‌తో సంబంధం
కాన్‌స్టాంటిన్ గాలిచ్ మరణం.. మార్కెట్‌లో చోటుచేసుకున్న భారీ నష్టాలతో సరికొత్త చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 100% సుంకం ప్రకటించిన వెంటనే క్రిప్టో మార్కెట్‌లో భారీ క్రాష్ సంభవించింది. ఈ క్రాష్ కారణంగా $19 బిలియన్లకు పైగా లివరేజ్ పొజిషన్లు కరిగిపోగా, 1.6 మిలియన్లకు పైగా ట్రేడింగ్ ఖాతాలు లిక్విడేట్ అయ్యాయి.
ఈ క్రాష్‌లో బిట్‌కాయిన్ విలువ దాదాపు 8% పడిపోయి $111,500కి చేరగా, ఎథీరియం 12.7% పడిపోయింది. 2020లో వచ్చిన కోవిడ్ క్రాష్, 2022లో జరిగిన ఎఫ్‌టిఎక్స్ (FTX) పతనం కంటే కూడా ఇది క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద లిక్విడేషన్ ఈవెంట్‌గా నిలిచింది.
ఎవరీ కాన్‌స్టాంటిన్ గాలిచ్?
32 ఏళ్ల కాన్‌స్టాంటిన్ గాలిచ్ గ్లోబల్ క్రిప్టో కమ్యూనిటీలో ప్రముఖ వ్యక్తి. అతను క్రిప్టాలజీ కీ ట్రేడింగ్ అకాడమీని సహ-స్థాపించాడు. డిజిటల్ ఆస్తులపై లోతైన విశ్లేషణ, వ్యూహాత్మక సలహాల కారణంగా సోషల్ మీడియాలో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. బ్లాక్‌చెయిన్ ట్రెండ్‌లు, ట్రేడింగ్‌లోని లోతైన అంశాలపై దృష్టి సారించే అతని టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా డిజిటల్ ఆస్తుల రంగంలో ఎదుగుతున్న తారగా గుర్తింపు పొందాడు. గాలిచ్ లంబోర్గినీ ఉరుస్, ఫెరారీ 296 జిటిబి వంటి ఖరీదైన కార్లను కలిగి ఉండి, విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ధి చెందాడు.


