Ukrainian refugee Iryna Zarutska stabbed on Charlotte train : బాంబుల వర్షం నుంచి తప్పించుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కుటుంబాలను, బంధాలను వదిలేసి వేల మైళ్ళ ప్రయాణం చేసి నూతన జీవితం కోసం వచ్చింది. యుద్ధ భూమి నుంచి శాంతి తీరానికి చేరానని ఊపిరి పీల్చుకుంది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో, తుపాకి గుండు చేయలేని కీడును ఒక కత్తి వేటు చేసింది. రష్యా దాడులతో ఛిద్రమైన ఉక్రెయిన్ నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి అమెరికాలో శరణార్థిగా అడుగుపెట్టిన ఇర్యానా జరుత్స్కా (23) అనే యువతి, నార్త్ కరోలినాలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అగ్రరాజ్యంలో ఆశ్రయం పొందిందని ఆనందించేలోపే, ఒక నిండు ప్రాణం ఎందుకు బలైపోయింది..? ఆ శాంతియుత నగరంలో ఆమె పాలిట మృత్యువైంది ఎవరు.? అసలేం జరిగింది ఆ రోజు..?
ఆ రాత్రి ఏం జరిగింది : ఆగస్టు 22, శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయం. నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే లైట్ రైలులో ఈ ఘోరం జరిగింది. ఇర్యానా జరుత్స్కా ఈస్ట్/వెస్ట్ బౌలేవార్డ్ స్టేషన్ సమీపంలో రైలులో ప్రయాణిస్తుండగా, ఆమెకు సమీపంలోనే కూర్చున్న నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.వీరిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ, కనీసం మాటలు గానీ జరగలేదని రైలులోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సుమారు నాలుగున్నర నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని, ఆ తర్వాత హఠాత్తుగా కత్తి తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడి నుంచి ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయాడు.తీవ్ర రక్తస్రావంతో ఇర్యానా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఎవరు ఈ ఇర్యానా జరుత్స్కా : ఇర్యానా జరుత్స్కా వయసు కేవలం 23 సంవత్సరాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన చెర్నిహివ్ నగరం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటీవలే అమెరికాకు వచ్చింది. యుద్ధం సృష్టించిన భయానక వాతావరణం నుంచి బయటపడి, అమెరికాలో ఒక కొత్త, సురక్షితమైన జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్నది.కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆమె కుటుంబం కోసం, బంధుమిత్రులు ఒక GoFundMe పేజీని ప్రారంభించి తమ ఆవేదనను పంచుకున్నారు.
నిందితుడు ఎవరు? అతని నేపథ్యం ఏంటి : పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని డెకార్లోస్ బ్రౌన్ జూనియర్ (34)గా గుర్తించారు. ఇతను ఒక నిరాశ్రయుడు (homeless) మరియు ఘోరమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి. దోపిడీ, ప్రాణాంతక ఆయుధంతో దాడి చేయడం వంటి అనేక కేసులలో ఇతను గతంలోనూ అరెస్ట్ అయ్యాడు. దాదాపు ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నిందితుడు తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి స్కిజోఫ్రెనియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని అతని తల్లి మీడియాకు తెలిపింది. ఈ దాడికి ముందు కూడా, తన శరీరంలో ఎవరో “మానవ నిర్మిత పదార్థాన్ని” అమర్చి తనను నియంత్రిస్తున్నారని 911కి ఫోన్ చేసి వింతగా ప్రవర్తించాడు.
అధికారుల స్పందన – సామాజిక ఆందోళన : ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితుడు బ్రౌన్‌ను అదుపులోకి తీసుకుని, ఫస్ట్-డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. ఈ దారుణ ఘటన అమెరికా వ్యాప్తంగా, ముఖ్యంగా షార్లెట్‌లోని ఉక్రెనియన్ సమాజంలో తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది. “యుద్ధం నుండి తప్పించుకుని శాంతియుత దేశానికి వచ్చిన ఒక అమ్మాయి, ప్రజా రవాణా వ్యవస్థలో కత్తిపోట్లకు గురై చనిపోవడం సిగ్గుచేటు. ఇక్కడి వ్యవస్థలు ఆమెను కాపాడటంలో విఫలమయ్యాయి” అని స్థానిక ఉక్రెయిన్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో అమెరికాలో శరణార్థుల భద్రత, ప్రజా రవాణాలో భద్రతా ప్రమాణాలు, మరియు మానసిక ఆరోగ్య సమస్యలున్న నేరస్థుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై తీవ్రమైన చర్చకు దారితీసింది.


