Homeఇంటర్నేషనల్World Map: ప్రపంచ పటం మారిందోచ్‌

World Map: ప్రపంచ పటం మారిందోచ్‌

న్యూయార్క్, (తెలుగుప్రభ): ప్రపంచాన్ని చూసే మన దృష్టినే మార్చే కీలక పరిణామం ఇది. శతాబ్దాలుగా భౌగోళిక ప్రాతినిధ్యానికి విస్తృతంగా ఉపయోగిస్తున్న మెర్కేటర్‌ ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి స్వస్తి పలికింది. ఖండాల అసలు విస్తీర్ణాలను మరింత కచ్చితంగా ప్రతిబింబించే సరికొత్త ప్రపంచ పటాన్ని ప్రోత్సహిస్తూ చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కొత్త ప్రొజెక్షన్‌లో ఆఫ్రికా మరింత విశాలంగా కనిపిస్తే.. ఐరోపా, ఉత్తర అమెరికా పరిమాణం గతంలో కనిపించిన దానికంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆఫ్రికా దేశమైన టోగో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయగా.. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఖండాల వాస్తవిక సాపేక్ష విస్తీర్ణాలను ప్రతిబింబించే సమాన-భూవైశాల్య ప్రాతిపదికన రూపొందించిన ప్రపంచ పటాలను ఇకపై ప్రోత్సహించాలని ఐరాస సభ్య దేశాలను కోరింది.

- Advertisement -

‘మెర్కేటర్‌’లో ఆఫ్రికాకు అన్యాయం?

మారిటైమ్‌ నావిగేషన్‌ అవసరాల కోసం ప్రముఖ కార్టోగ్రాఫర్‌ గెరార్డస్‌ మెర్కేటర్‌ 1569లో తన ప్రపంచ పటాన్ని రూపొందించారు. భూభాగాల ఆకృతులు, కోణాలను కచ్చితంగా చూపించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ మ్యాప్‌ శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగంలో ఉంది. అయితే.. భూమి గోళాకారంలో ఉండగా దాన్ని ద్విమితీయ పటంగా చూపించాల్సి రావడంతో భౌగోళిక వక్రీకరణలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. దీంతో మెర్కేటర్‌ పటంలో ఐరోపా, ఉత్తర అమెరికా భారీగా కనిపించగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వాస్తవ విస్తీర్ణం కంటే చిన్నగా కనిపిస్తాయి.

‘ఈక్వల్‌ ఎర్త్‌’తో అసలు పరిమాణాలు

ఈ సమస్యకు పరిష్కారంగా కార్టోగ్రాఫర్లు 2018లో *‘ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌’*ను రూపొందించారు. ఇందులో ఖండాల సాపేక్ష ఉపరితల వైశాల్యాలను సాధ్యమైనంతవరకు యథాతథంగా చూపించడంపై దృష్టి పెట్టారు. ఈ పటంలో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలు గతంలో కంటే మరింత విశాలంగా కనిపిస్తాయి. తాజాగా ఐరాస ఆమోదించిన తీర్మానం ఈ తరహా సమాన-భూవైశాల్య పటాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్‌ మాట్లాడుతూ.. ప్రపంచ పటాలు విద్యకు మార్గనిర్దేశం చేయడంతో పాటు ప్రజల ఊహాశక్తిని ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల అవి సాధ్యమైనంత కచ్చితంగా ఉండాలని, భవిష్యత్‌ తరాలకు ఆస్తిగా నిలవాలని పేర్కొన్నారు.

అమెరికా తీవ్ర వ్యతిరేకత

అయితే ఈ తీర్మానాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచంలో ఉన్న అసలు సమస్యలను పక్కనబెట్టి ఇలాంటి పటాలపై ఐరాస చర్చలు జరపడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి తీర్మానాల వల్లే ఐరాస తన విశ్వసనీయతను కోల్పోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. మెర్కేటర్‌ మ్యాప్‌ను పూర్తిగా పక్కనపెట్టి కొత్త ప్రొజెక్షన్‌కు మారనున్నట్లు ఫ్రాన్స్‌ ఐరాస సమావేశంలో ప్రకటించింది.
కొత్త ప్రపంచ పటం కేవలం భౌగోళిక ప్రాతినిధ్యంలో మార్పు మాత్రమే కాదని.. ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామన్న దానిపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News