UN Accuses Israel of Committing Genocide in Gaza: అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక స్వతంత్ర విచారణ కమిషన్ గాజాలో ఇజ్రాయెల్ “జాతి నిర్మూలనకు” (జెనోసైడ్) పాల్పడిందని నిర్ధారించింది. 2023లో హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడులు, అనుసరించిన విధానాలు జాతి నిర్మూలన కిందకే వస్తాయని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది, ఇది “వక్రీకరించిన, అసత్య నివేదిక” అని కొట్టిపారేసింది.
ALSO READ: Elon Musk: లండన్‌లో భారీ హింస.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. ‘పోరాడండి లేదా చావండి’ అంటూ..
దక్షిణాఫ్రికాకు చెందిన, గతంలో ఐరాస మానవ హక్కుల మాజీ చీఫ్‌గా పనిచేసిన నవీ పిళ్ళై నేతృత్వంలోని ఈ ముగ్గురు సభ్యుల కమిషన్, అంతర్జాతీయ చట్టం ప్రకారం నిర్వచించిన ఐదు జాతి నిర్మూలన చర్యలలో నాలుగు ఇజ్రాయెల్ చేపట్టినట్లు చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. అవి:
- ఒక సమూహంలోని సభ్యులను చంపడం: సాధారణ పౌరులు, రక్షిత ప్రాంతాలపై దాడులు జరిపి పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లను హతమార్చడం.
- తీవ్రమైన శారీరక, మానసిక హాని కలిగించడం: నిరంతర దాడులు, నిర్బంధంలో ఉన్నవారిని తీవ్రంగా హింసించడం, బలవంతంగా ప్రజలను వారి నివాసాల నుండి తరిమివేయడం.
- సమూహ నాశనానికి దారితీసే పరిస్థితులను కల్పించడం: ఆసుపత్రులు, ఇళ్లు, తాగునీటి వ్యవస్థలను ధ్వంసం చేయడం, ఆహారం, నీరు, ఇంధనం వంటి అత్యవసర సరుకుల సరఫరాను అడ్డుకోవడం ద్వారా ప్రజల జీవనాన్ని అసాధ్యంగా మార్చడం.
- జననాలను నిరోధించడం: గాజాలోని అతిపెద్ద ఫెర్టిలిటీ క్లినిక్‌పై దాడి చేసి వేలాది పిండాలు, వీర్య కణాలను నాశనం చేయడం ద్వారా భవిష్యత్ తరాలను దెబ్బతీయడం.
జాతి నిర్మూలన ఉద్దేశంతోనే..
ఈ చర్యల వెనుక “జాతి నిర్మూలన ఉద్దేశం” స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ వంటి ఉన్నత స్థాయి నాయకులు చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనమని నివేదిక ఉటంకించింది. “దుష్ట నగరాన్ని శిథిలాల కుప్పగా మారుస్తాం,” “మనం మానవ మృగాలతో పోరాడుతున్నాం,” “ఈ దాడికి అక్కడ ఉన్న జాతి మొత్తం బాధ్యత వహించాలి” వంటి వ్యాఖ్యలు పాలస్తీనియన్లందరినీ లక్ష్యంగా చేసుకున్న ఉద్దేశాన్ని సూచిస్తున్నాయని కమిషన్ విశ్లేషించింది.
ఇది ఆత్మరక్షణ చర్య: ఇజ్రాయెల్
అయితే, ఇజ్రాయెల్ ఈ నివేదికను పూర్తిగా తోసిపుచ్చింది. కమిషన్‌లోని నిపుణులు “హమాస్ ప్రతినిధులుగా” వ్యవహరిస్తున్నారని, పూర్తిగా హమాస్ చెప్పిన అబద్ధాలపై ఆధారపడి ఈ నివేదిక తయారు చేశారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అక్టోబర్ 7న 1,200 మందిని చంపి, మహిళలపై అత్యాచారాలు చేసి, యూదులందరినీ చంపడమే లక్ష్యమని ప్రకటించిన హమాస్సే అసలు జాతి నిర్మూలనకు ప్రయత్నించిందని ఎదురుదాడి చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ఆత్మరక్షణ కోసమే పనిచేస్తోందని, పౌరులకు హాని కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోందని స్పష్టం చేసింది.
ALSO READ: Trump: ‘ది న్యూయార్క్ టైమ్స్’ పై ట్రంప్ దావా.. ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు!
ఆ బాధ్యత ప్రపంచ దేశాలదే..
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాపై సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి గాజాలో 64,000 మందికి పైగా మరణించారని, 90% ఇళ్లు ధ్వంసమయ్యాయని, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలు కుప్పకూలాయని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కమిషన్ నివేదిక అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్ చర్యలను నివారించి, బాధ్యులను శిక్షించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని, లేకపోతే వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు అవుతారని కమిషన్ హెచ్చరించింది.
ALSO READ: Kim Jong Un : ఉత్తర కొరియాలో ‘బర్గర్’, ‘ఐస్‌క్రీమ్’పై నిషేధం


