Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Afghanistan: అఫ్గాన్ లో ప్రకృతి విలయం.. 622 మంది మృతి

Afghanistan: అఫ్గాన్ లో ప్రకృతి విలయం.. 622 మంది మృతి

Afghanistan: అఫ్గానిస్థాన్ ని ప్రకృతి విలయం వణికిస్తోంది. భారీ భూకంపం సంభవించి 600 మందికిపైగా చనిపోయారు.  పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు (Earthquake in Afghanistan) కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ వెల్లడించింది. మరో 1500 మంది వరకు గాయపడినట్లు తెలిపింది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం చాలా తీవ్రంగా ఉండటంతో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌లో ఇప్పటివరకు 622 మంది మరణించారు. అనేక మందికి గాయాలయ్యాయి. అనేక ప్రాంతాలలో భారీ నష్టం కూడా సంభవించింది. ఘోర విపత్తు కారణంగా కునార్‌ ప్రావిన్స్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. అఫ్గాన్ కు అత్యవసర సాయం అందించింది.

- Advertisement -

ఇతరదేశాల్లోనూ..

భూకంపం ఎంత బలంగా ఉందంటే దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా కనిపించాయి. దీనితో పాటు, పాక్ లో కూడా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. దాదాపు 20 నిమిషాల తర్వాత.. అదే ప్రావిన్స్‌లో రెండవ సారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.5 .. లోతు 10 కిలోమీటర్లు.

మోదీ సంతాపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూకంప మృతులక సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు “అఫ్గానిస్థాన్ లో భూకంపం కారణంగా ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారకరం. ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం” అని దీ చెప్పుకొచ్చారు. బాధితులకు మానవతా సాయం అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా అప్గాన్ ప్రజలకు అండగా ఉంటామన్నారు.  “ఈ అత్యవసర సమయంలో భారతదేశం సహాయం అందిస్తుంది. బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మా ప్రార్థనలు” అని ఆయన అన్నారు.

ఆగస్టులో ఐదోసారి భూకంపం

గత నెలలో అఫ్గాన్ లో ఇది ఐదవ భూకంపం. ఈ దేశం భూకంపాల పరంగా చాలా సున్నితమైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అంతకుముందు, ఆగస్టు 27న 5.4 తీవ్రతతో, ఆగస్టు 17న 4.9 తీవ్రతతో, ఆగస్టు 13న 10 కి.మీ లోతులో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు, ఆగస్టు 8న, 10 కి.మీ లోతులో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారంటే భూకంపాలను రిక్టర్ స్కేల్ ఉపయోగించి కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్‌లో, భూకంపాలను 1 నుంచి 9 ఆధారంగా కొలుస్తారు. దీనిని దాని కేంద్రం నుంచి అంటే భూకంప కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను దీని ద్వారా కొలుస్తారు.

2023లో..

అక్టోబర్ 7, 2023న, అఫ్గాన్ లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత బలమైన ప్రకంపనలు సంభవించాయి. దాదాపు 4 వేల మంది మరణించారని తాలిబాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఐక్యరాజ్యసమితి 1,500 మంది మరణించి ఉంటారని పేర్కొంది. ఈ విపత్తుపై యూఎన్ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ప్రజలందరూ గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. భూ ప్రకంపనల ధాటికి భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఇటీవలి కాలంలో అఫ్గాన్ ను తాకిన అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి వైపరీత్యం ఇది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad