UNO Human Rights Report: ఉత్తర కొరియాలో రోజురోజుకూ నియంతృత్వ పాలన పెరుగుతోంది. ఆ దేశంలో మానవ హక్కుల అణచివేత తీవ్రస్థాయికి చేరింది. ఎంతలా అంటే.. విదేశీ టీవీ షోలను చూసినా లేదా వాటిని షేర్ చేసినా ఉరిశిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేశారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య.. ఉత్తర కొరియా ప్రజలు జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల విభాగం వెల్లడించింది.
మరెక్కడా లేనంత కఠిన ఆంక్షలు: ఉత్తర కొరియాలో మానవ హక్కుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని.. ఐరాస మానవ హక్కుల విభాగం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ఆ దేశ నియంతృత్వ పాలన రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోందని వెల్లడించింది. ప్రపంచంలో మరెక్కడా లేనంత కఠినమైన ఆంక్షల మధ్య ఉత్తర కొరియా ప్రజలు జీవిస్తున్నారని వెల్లడించింది. 2014 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఐరాస మానవ హక్కుల విభాగం ఈ నివేదికను రూపొందించింది.
ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు:
శిక్షలు, చట్టాలు: విదేశీ టీవీ డ్రామాలు చూసినా లేదా షేర్ చేసినా ఉరిశిక్ష విధించేంత కఠినమైన చట్టాలు ఉత్తర కొరియాలో అమల్లో ఉన్నాయి. 2015 తర్వాత అమలైన కొత్త విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతీ అంశంపై ప్రభుత్వ నియంత్రణ పెరిగిందని తెలిపింది.
తీవ్ర నిఘా: కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ప్రతీ కదలికపైనా నిఘాను తీవ్రం చేశారని ఐరాస పేర్కొంది. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సాధారణంగా మారాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
సాక్షుల వాంగ్మూలం: ఈ నివేదికను రూపొందించడానికి, ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా ఐరాస మానవ హక్కుల విభాగం పేర్కొంది.
ప్రభుత్వ స్పందన: ఐరాస నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. ఈ నివేదికను రూపొందించిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని.. తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.
సానుకూల అంశాలు: కొన్ని పరిమిత మెరుగుదలను కూడా ఈ నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గడం లాంటి అంశాల గురించి సానుకూలంగా నివేదక వెల్లడించింది. నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావడం వంటి స్వల్ప సానుకూల అంశాలని ఐరాస మానవ హక్కుల విభాగం తన నివేదికలో పేర్కొంది.


