US Court on Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద ఆర్థిక విధానాల కారణంగా కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తిన్నారు. ఆయన రెండవసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంబంధాలను కుదిపేసిన టారిఫ్‌లపై అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు శుక్రవారం (ఆగస్టు 29)న కీలక తీర్పు వెలువరించింది. ఇందులో ట్రంప్ టారిఫ్స్ చెల్లవంటూ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు భారత్ వంటి అధిక సుంకాలు ఎదుర్కొంటున్న దేశాలకు పెద్ద ఊరటగా నిపుణులు చెబుతున్నారు.
7-4 న్యాయమూర్తుల తీర్పులో ట్రంప్ IEEPA (International Emergency Economic Powers Act) అనే అత్యవసర చట్టాన్ని ఉపయోగించి విధించిన విస్తృత టారిఫ్‌లు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తనకున్న అధికారం దాటి వెళ్లిన చర్యలుగా కోర్టు పేర్కొంది. అంటే.. అధ్యక్షుడికి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కొన్ని విస్తృత అధికారాలు ఉన్నా, తనంతట తానే కొత్త పన్నులు లేదా గ్లోబల్ టారిఫ్‌లు విధించే హక్కు లేదని స్పష్టం చేసింది అమెరికా కోర్టు. తక్షణమే ప్రభావం చూపకుండా.. అక్టోబర్ మధ్య వరకు టారిఫ్‌లు కొనసాగుతాయని కోర్టు చెప్పింది. దీంతో ట్రంప్‌కు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం దొరికింది.
అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ తన సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మన టారిఫ్‌లు చివరికి దేశ ప్రయోజనం కోసం ఉన్నాయని సుప్రీంకోర్టు నిరూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనిపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని ట్రూత్ ఖాతాలో ప్రకటించారు ట్రంప్. ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌లు చట్టబద్ధం కాకపోవడం వల్ల బిల్లియన్ల డాలర్ల వసూళ్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Sugali Preethi : సుగాలి ప్రీతి కేసు.. పవన్ కల్యాణ్‌పై ఆరోపణలకు జనసేన గట్టి కౌంటర్
టారిఫ్స్ సమయంలో యూరోపియన్ యూనియన్‌తో సహా ప్రధాన భాగస్వామ్య దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల భవిష్యత్తు సైతం కూడా నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పుతో అమెరికా వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతింటాయనే భయం కూడా వైట్ హౌస్‌లో వ్యక్తమవుతోంది.
2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అమెరికాకు వ్యతిరేకంగా “అన్యాయ వ్యాపార పన్నులు” విధిస్తున్నారనే కారణంతో అన్ని దేశాలపై 10% సాధారణ టారిఫ్‌ను విధించారు. ఆ తర్వాత వాటిని పెంచిన ట్రంప్.. రష్యా క్రూడ్ ఆయిల్ కొంటున్నామనే కారణాన్ని చూపుతూ భారతదేశాన్ని టార్గెట్ చేసి అత్యధికంగా 50 శాతం టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెక్సికో, కెనడా, చైనాతో మాదకద్రవ్యాల రవాణా అంశాన్ని జాతీయ అత్యవసరంగా చూపిస్తూ ప్రత్యేక టారిఫ్‌లు కూడా విధించారు. కానీ ట్రంప్ తనకు ఉన్న అధికారాలను దాటి ప్రవర్తించారంటూ, ఆయనకు టారిఫ్స్ విధించే అధికారం లేదంటూ ప్రస్తుతం యూఎస్ కోర్టు ఇచ్చిన తీర్పుతో వాటికి చట్టబద్ధత దొరకదని తెలుస్తోంది. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని సమర్థిస్తే భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరట లభించనుంది.


