US designates The Resistance Front: కశ్మీర్ అందాలను రక్తసిక్తం చేసిన పహల్గాం ఉగ్రదాడి దుర్ఘటన తరువాత, అమెరికా ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఉగ్ర మూకలపై ఉక్కుపాదం మోపింది. అయితే, ఈ నిర్ణయం కేవలం భారత్‌కు మద్దతుగా తీసుకున్నదేనా, లేక దీని వెనుక ఇంకేమైనా అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? అసలు టీఆర్ఎఫ్ కథ ఏమిటి..?
భారతదేశంలో ముంబయి 26/11 తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన పౌరహత్యకాండగా నిలిచిన పహల్గాం దాడిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా, ప్రత్యేకంగా నియమించిన ప్రపంచ ఉగ్రవాద సంస్థ (SDGT)గా గుర్తిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది.
లష్కరేకు ముసుగు సంస్థ:
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సందర్భంగా మాట్లాడుతూ, “టీఆర్ఎఫ్ అనేది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు ఒక ముసుగు మాత్రమే,” అని కుండబద్దలు కొట్టారు. “పహల్గాం దాడికి న్యాయం జరగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపు మేరకు, అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు.
దాడి ఘాతుకమిలా:
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక స్వర్గం పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.ఈ దుశ్చర్యలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మొదట ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు టీఆర్ఎఫ్ ప్రకటించినా, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో మాట మార్చింది.
భారత్ ముందడుగు, అంతర్జాతీయ మద్దతు:
ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్రంగా స్పందించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) టీఆర్ఎఫ్ అధిపతి షేక్ సజ్జాద్ గుల్‌ను ప్రధాన సూత్రధారిగా గుర్తించింది.మరోవైపు, ఇటీవల అమెరికాలో జరిగిన ‘క్వాడ్’ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) విదేశాంగ మంత్రుల సమావేశంలో పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ తీసుకుంటున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని క్వాడ్ దేశాలు భరోసా ఇచ్చాయి. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు లభించిన కీలక దౌత్య విజయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.


