ఆరిజోనా ( తెలుగు ప్రభ ) : నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న వేళ.. అమెరికాలోనూ ఆకస్మిక వరదలు కలకలం సృష్టించాయి. ఆరిజోనా రాష్ట్రంలోని ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 20 మందికిపైగా గల్లంతయ్యారు. వారిలో 15 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేషనల్ పార్క్‌లోని బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉద్ధృతికి పెద్దపెద్ద బండరాళ్లు, లోహపు నిర్మాణాలు కొట్టుకుపోయి కొలరాడో నదిలో కలిసిపోయాయని నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది.
ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరిజోనా రాష్ట్ర అధికారులతో కలిసి సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని నేషనల్ పార్క్ సర్వీస్ పేర్కొంది. కొలరాడో నదిలో కలిసే బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఆకస్మిక వరదలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వరదల తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో పార్క్ పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నట్లు ఆ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

