US Federal Government Partial Shutdown 2026 : ప్రపంచానికే ఆర్థిక దిక్సూచిగా నిలిచే అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా ‘నిశ్శబ్దం’ ఆవరించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పాక్షికంగా స్తంభించిపోయింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు గడువు ముగిసినప్పటికీ, కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయకపోవడంతో ‘గవర్నమెంట్ షట్‌డౌన్’ అనివార్యమైంది. అగ్రరాజ్యం ఆశలు ఇప్పుడు సోమవారం నాటి సభ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి.
సంక్షోభానికి బీజం: మిన్నియాపాలిస్ ‘రక్తం’.. డెమొక్రాట్ల ‘ఆగ్రహం’ : ఈ షట్‌డౌన్‌కు కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే కాదు, అంతకంటే లోతైన రాజకీయ, మానవీయ కోణాలు ఉన్నాయి.
నిరసనకారుల మృతి: మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మృతి చెందడం అమెరికాలో కార్చిచ్చు రేపింది. ఈ ఘటనపై డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చల వైఫల్యం: హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగానికి ఇచ్చే నిధులపై చర్చలు జరుగుతుండగా, ఈ హత్యల అంశం తెరపైకి రావడంతో చర్చలు పూర్తిగా పట్టాలు తప్పాయి. “నిరసనకారులను లక్ష్యంగా చేసుకోవడం కోసం ట్రంప్ ప్రభుత్వం వనరులను వృధా చేస్తోంది” అని సెనేట్ డెమొక్రాటిక్ నాయకుడు డిక్ డర్బిన్ విమర్శించారు.
సందిగ్ధంలో 75% సేవలు: బడ్జెట్ ఆగిపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ మరియు రక్షణ రంగాలకు చెందిన సుమారు ముప్పావు వంతు ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం పడింది.
ఉద్యోగులపై ‘వేటు’.. సంక్షోభం ఎంతకాలం : ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగితే లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. మరికొందరు జీతం లేకుండానే విధులకు హాజరు కావాల్సి వస్తుంది. అయితే, ఈసారి సంక్షోభం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పరిష్కారం దిశగా అడుగులు: శుక్రవారం అర్థరాత్రికి ముందే సెనేట్ ఐదు కీలక నిధుల బిల్లులతో పాటు, రెండు వారాల తాత్కాలిక ‘స్టాప్‌గ్యాప్’ చర్యను ఆమోదించింది. సోమవారం నాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కేవలం కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలై షట్‌డౌన్ ముగుస్తుంది. తద్వారా ప్రభుత్వ సేవలు మళ్లీ పట్టాలెక్కుతాయి.

