Thursday, March 12, 2026
Homeఇంటర్నేషనల్H1B Visa : అమెరికా ఆశలపై ఆందోళన.. వీసా రద్దుకు రంగం సిద్ధం? భారతీయ...

H1B Visa : అమెరికా ఆశలపై ఆందోళన.. వీసా రద్దుకు రంగం సిద్ధం? భారతీయ ఐటీ నిపుణుల్లో గుబులు

H1B Visa Program Cancellation Bill : లక్షలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆరాధ్య దైవం, అమెరికా వెళ్లేందుకు ప్రధాన ద్వారం అయిన ‘హెచ్-1బీ’ వీసా వ్యవస్థ ఇప్పుడు ‘పిడుగుపాటు’ లాంటి వార్తతో వణికిపోతోంది. ఏటా వేల సంఖ్యలో నిపుణులు కనే ‘అమెరికా కల’కు గండి కొట్టేలా యూఎస్ కాంగ్రెస్‌లో ఒక కీలక బిల్లు ప్రవేశపెట్టారు. “విదేశీ శ్రమను దోపిడీ చేస్తూ, అమెరికా పౌరుల అవకాశాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తున్నాయి” అన్న వాదనతో ఈ మార్పునకు శ్రీకారం చుట్టారు. 

- Advertisement -

ఎక్సైల్ యాక్ట్: మర్మమేమిటి : ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ లేదా EXILE Actను ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని సవరించడం ద్వారా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయడం.

కార్పొరేట్ దోపిడీ: పెద్ద కంపెనీలు అమెరికా నిపుణులకు తక్కువ వేతనం ఇవ్వడానికి, విదేశీయులను తక్కువ ధరకు ‘దిగుమతి’ చేసుకుంటున్నాయని స్టూబ్ ఆరోపించారు.
వ్యవస్థ ప్రక్షాళన: ఈ వీసా వ్యవస్థ స్వదేశీయుల ఉపాధిని దెబ్బతీస్తోందని, దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వాదించారు.

తనిఖీల కొరడా: సోషల్ మీడియాపై నిఘా : వీసా రద్దు బిల్లు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇప్పటికే ఉన్న నిబంధనలను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘వజ్రాయుధం’లా మారుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం:
తీవ్రస్థాయి స్క్రీనింగ్: హెచ్-1బీ మరియు దానిపై ఆధారపడే హెచ్-4 (డిపెండెంట్) వీసా దరఖాస్తుదారుల విషయంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
డిజిటల్ ఫుట్‌ప్రింట్: దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారి పోస్టులు, అభిప్రాయాలు అమెరికా భద్రతకు లేదా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయా అనే కోణంలో ‘వెట్టింగ్’ (పరిశీలన) సాగుతోంది.

భారతీయ నిపుణులపై ప్రభావం : హెచ్-1బీ వీసాల లబ్ధిదారుల్లో దాదాపు 70 శాతానికి పైగా భారతీయులే ఉండటం గమనార్హం. ఈ బిల్లు వల్ల కేవలం కొత్తగా వెళ్లేవారే కాకుండా, ఇప్పటికే అక్కడ ఉండి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారి భవిష్యత్తు కూడా అడకత్తెరలో పోకచెక్కలా మారే ప్రమాదం ఉంది. హెచ్-1బీ రద్దయితే, వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసాలు కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. దీంతో వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News