US is Now the Tariff King of the World: అమెరికా ఇటీవలి కాలంలో వివిధ దేశాలపై విధిస్తున్న సుంకాల (టారిఫ్) వల్ల ఆ దేశం ‘ప్రపంచ టారిఫ్ కింగ్’గా మారిందని భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాల గురించి స్వరూప్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
కొత్తగా ఏర్పడిన అమెరికా ప్రభుత్వం వివిధ దేశాల నుండి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తోందని వికాస్ స్వరూప్ అన్నారు. ముఖ్యంగా, చైనా నుండి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై 100% వరకు సుంకాలు విధించడం వంటి కఠినమైన చర్యలను అమెరికా తీసుకుంటుందని వివరించారు.
దీర్ఘకాలంలో నష్టం..
టారిఫ్‌లు విధించడం వల్ల ఒక దేశానికి స్వల్పకాలంలో లాభం చేకూరవచ్చని, కానీ దీర్ఘకాలంలో ఇది ప్రపంచ వాణిజ్యానికి, అంతర్జాతీయ సంబంధాలకు నష్టం చేకూరుస్తుందని స్వరూప్ హెచ్చరించారు. ఈ విధానాలు ఇతర దేశాల నుండి కూడా ప్రతీకార చర్యలకు దారితీసే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచ వాణిజ్య వ్యవస్థ అస్థిరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంపై కూడా ఈ టారిఫ్‌ల ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నకు, అమెరికా భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని స్వరూప్ పేర్కొన్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఈ రక్షణాత్మక విధానాలు భారతదేశంపై కూడా ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలని ఆయన అన్నారు.


