US monitoring India-Pakistan ceasefire : భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఈ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. ఒప్పందం ఉన్నప్పటికీ, సరిహద్దుల్లోని ప్రశాంతత ఎంతకాలం నిలబడుతుందనేది ప్రశ్నార్థకమేనని అమెరికా అభిప్రాయం. ఈ ఆందోళన వెనుక ఉన్న లోతైన కారణాలను పరిశీలిస్తే, భౌగోళిక రాజకీయాల సంక్లిష్టత అర్థమవుతుంది.
శాంతి ఒప్పందాలు పెళుసు: రూబియో : ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం చాలా పెళుసుగా ఉంటుందని, దానిని కొనసాగించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య నెలకొన్న సున్నితమైన పరిస్థితులను అమెరికా ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాలు చాలా త్వరగా ఉల్లంఘనకు గురవుతాయి,” అని ఆయన స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపుతూ, ఇరుపక్షాలు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. తన దేశ ప్రజలు అదృష్టవంతులని, శాంతిని ప్రథమ ప్రాధాన్యతగా భావించే ట్రంప్ వంటి అధ్యక్షుడు వారికి ఉన్నారని రూబియో అన్నారు. భారత్-పాక్ సహా అనేక దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు.
‘యుద్ధం ఆపింది నేనే’: ట్రంప్ ప్రచారం : మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాక్ మధ్య శాంతి స్థాపన క్రెడిట్‌ను పూర్తిగా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మే 10న వాషింగ్టన్ చొరవతోనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిందని, అణుయుద్ధం ముంగిట నిలిచిన దేశాలను తానే కాపాడానని ఆయన పదేపదే చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 40 సార్లు వివిధ వేదికలపై ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇటీవలే అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయినప్పుడు కూడా, “భారత్, పాక్‌ను చూడండి. అణు యుద్ధానికి సిద్ధమయ్యాయి. నేను వెంటనే రంగంలోకి దిగి కాల్పుల విరమణ కుదిర్చాను. యుద్ధాలను ఆపగల సత్తా నాకుంది,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అగ్రరాజ్యం వాదనను తోసిపుచ్చిన భారత్ : అయితే, ట్రంప్ వాదనను భారత్ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్థాన్ సైన్యం చేసిన విజ్ఞప్తి మేరకే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని స్పష్టం చేస్తోంది. ఈ ఒప్పందంలో మూడో పక్షం జోక్యం లేనేలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ దేశమూ తమను కోరలేదని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ట్రంప్ చెబుతున్నట్లుగా ఇది వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం కాదని కూడా భారత్ తేల్చిచెప్పింది.
ట్రంప్‌కు పాక్ జై.. తెర వెనుక మతలబు : ఈ విషయంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం పాకిస్థాన్ వైఖరి. భారత్ వాదనకు విరుద్ధంగా, పాకిస్థాన్ మాత్రం ట్రంప్ వాదనకే మద్దతు పలుకుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఘనత ట్రంప్‌దేనని అంగీకరిస్తోంది. దీని వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించడం వెనుక వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. దీనికి తోడు, అమెరికా ఇస్లామాబాద్‌తో కీలకమైన చమురు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే, అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే పాకిస్థాన్ ట్రంప్ వాదనకు వంత పాడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


