US plans to attack Iran: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులకు సపోర్ట్ చేస్తూ, ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ట్రంప్‌కు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మరో నాలుగు అరబ్ దేశాలతో కలిసి ఈ దాడులకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన సమాచారం సైతం బయటకి లీకయ్యింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు నడుస్తుండగా.. 2015లో ఒబామా హయాంలో అణు ఒప్పందం జరిగింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2018లో దాన్ని ఉల్లంఘించారు. 2025 జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయగా.. ఆ తర్వాత అమెరికా కూడా మరో మూడు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఇరాన్‌ను బెదిరింపులకు గురిచేస్తుండటంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలని కోరుతున్నారు. అలాగే వాళ్ల దగ్గర ఉన్న బాలిస్టిక్ క్షిపణులను పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇరాన్ తమకు కట్టుబడి ఉండకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు.
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు..
అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు నాలుగు అరబ్ దేశాలు కలిసి ఇరాన్‌పై దాడులు చేసే ప్రణాళికను రూపొందించాయి. ఇజ్రాయెల్ వార్త పత్రిక ప్రకారం.. ట్రంప్ తన టీమ్‌ను ఓ సైనిక ప్రణాళికను అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. ఈ ప్లాన్ జాబితా రహస్యంగా ఉంది. మరోవైపు, ఖతార్, ఒమన్, ఈజిప్ట్ లాంటి దేశాలు ఇరాన్‌పై దాడులు చేయొద్దని కోరుతున్నాయి. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ అగ్రనాయకులు, ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) కమాండర్లు, భద్రతా దళాలును బలహీనపర్చాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణి కర్మాగారాలు, వాయు రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలను అలాగే అమెరికా మిత్రదేశాలను చేరుకోగల ఇరానియన్ క్షిపణులను నాశనం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు వెళ్లాయని ట్రంప్ చెప్పడంతో ఇందుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ, ఈ దాడులు జరిగితే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం యావత్ ప్రపంచంపై ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

