Presidential Post is a Death Trap: అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైన వృత్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో తనపై జరిగిన రెండు హత్యాయత్నాలను ప్రస్తావిస్తూ, ఈ పదవి ‘మరణ రిస్క్’తో నిండి ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 27, 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టులు, ఏకసభ్య ధర్మాసనాల అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పు నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కార్ రేసింగ్, బుల్ రైడింగ్‌ల కంటే ప్రమాదం:
అధ్యక్ష పదవిని కార్ రేసింగ్, బుల్ రైడింగ్‌లతో పోల్చిన ట్రంప్, “కార్ రేసింగ్‌లో 1% మంది మరణించే అవకాశం ఉంది. అధ్యక్ష పదవిలో 5% మరణ రిస్క్ ఉంది. ఇది తెలిసి ఉంటే నేను ఎన్నికల రేసులో ఉండేవాడిని కాదు” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ పేర్కొన్న 5% గణాంకానికి శాస్త్రీయ ఆధారాలు లేవని అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2024 హత్యాయత్నాల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అధ్యక్ష పదవిలోని సవాళ్లను సూచిస్తుంది
ట్రంప్ పై రెండు సార్లు హత్యాయత్నాలు: 2024లో డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాలు అమెరికాను ఉలిక్కిపడేలా చేశాయి.
జూలై 13, 2024, పెన్సిల్వేనియా:
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమవ్వగా, సమీపంలోని ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై దుండగుడిని కాల్చి చంపాయి.
సెప్టెంబర్ 2024, ఫ్లోరిడా:
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, రైఫిల్‌తో ఉన్న ఓ వ్యక్తి ఫెన్సింగ్ వద్ద కనిపించాడు. సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి కాల్పులూ జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చారిత్రక సంఘటనలు : అమెరికా చరిత్రలో నలుగురు అధ్యక్షులు లింకన్, గార్ఫీల్డ్, మెక్‌కిన్లీ, కెన్నెడీ పదవిలో హత్యకు గురయ్యారు. రీగన్, ఫోర్డ్‌పై కూడా హత్యాయత్నాలు జరిగాయి.
అబ్రహం లింకన్ (1865 ఏప్రిల్ 14):
అమెరికా అంతర్యుద్ధంలో దేశాన్ని విజయపథంలో నడిపించిన మహనీయుడు అబ్రహం లింకన్. వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్‌లో నాటకం చూస్తుండగా, జాన్ విల్కేస్ బూత్ అనే నటుడి కాల్పులకు బలైయ్యారు. ఈ ఘటన అమెరికా చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది.
జేమ్స్ గార్ఫీల్డ్ (1881 జూలై 2):
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం కొద్ది నెలలకే, జేమ్స్ గార్ఫీల్డ్ ఒక దారుణమైన హత్యాయత్నానికి గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని రైల్వే స్టేషన్‌లో చార్లెస్ గైటో అనే వ్యక్తి కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 80 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం సెప్టెంబర్ 19, 1881న గార్ఫీల్డ్ కన్నుమూశారు.
విలియం మెక్‌కిన్లీ (1901 సెప్టెంబర్ 6):
న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన పాన్-అమెరికన్ ఎక్స్‌పోజిషన్‌లో ప్రజలను కలుస్తున్న సమయంలో అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లీపై లియోన్ సిజోల్గోస్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మెక్‌కిన్లీ ప్రాణాలు కోల్పోయారు.
జాన్ ఎఫ్. కెన్నెడీ (1963 నవంబర్ 22):
20వ శతాబ్దంలో అమెరికాను కుదిపేసిన అత్యంత విషాద ఘటనలలో ఒకటి జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య. టెక్సాస్‌లోని డల్లాస్‌లో మోటార్‌కేడ్‌లో ప్రయాణిస్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి కాల్పులు జరిపి కెన్నెడీని హత్య చేశాడు. ఈ సంఘటన నేటికీ అనేక కుట్ర సిద్ధాంతాలకు దారితీస్తోంది.ఈ నలుగురు అధ్యక్షుల దారుణ హత్యలతో పాటు, పలువురు అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. వీరు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు.
జెరాల్డ్ ఫోర్డ్ (1975):
1975లో జెరాడ్ ఫోర్డ్‌పై రెండు వేర్వేరు హత్యాయత్నాలు జరిగాయి. సెప్టెంబర్ 5న సాక్రమెంటోలో లిన్నెట్ “స్క్వీకీ” ఫ్రోమ్, సెప్టెంబర్ 22న శాన్ ఫ్రాన్సిస్కోలో సారా జేన్ మూర్ కాల్పులు జరపగా, ఫోర్డ్ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు.
రొనాల్డ్ రీగన్ (1981 మార్చి 30):
వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్ బయట జాన్ హింక్లీ జూనియర్ కాల్పులు జరపగా, అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే, సమయానికి అందిన వైద్య సహాయం వల్ల ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకున్నారు.
రువాండా-డీఆర్‌సీ శాంతి ఒప్పందం:
తన పదవీకాలంలో (2025లో) ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ముఖ్యమైన దౌత్య విజయాన్ని సాధించింది. రువాండా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తూర్పు డీఆర్‌సీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఒప్పందం హింసను గణనీయంగా తగ్గించి, ప్రాంతంలో స్థిరత్వాన్ని పెంచిందని నిపుణులు ప్రశంసించారు. రువాండా-డీఆర్‌సీ శాంతి ఒప్పందం ట్రంప్ దౌత్య విజయాల్లో ఒకటిగా నిలిచింది.