Trump on Russian Crude: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటం చేశారు. భారత ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య, డిప్లొమాటిక్ సంబంధాలకు అడ్డంకిగా మారిన రష్యా క్రూడ్ కొనుగోళ్లను నిలిపివేస్తామని తనకు మాటిచ్చినట్లు ట్రంప్ చెప్పారు. ఈ మేరకు బుధవారం వైట్ హౌస్ సమావేశంలో మీడియా ముందు ట్రంప్ ఈ విషయం బయటపెట్టారు.
తాను రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయటంపై సంతోషంగా లేనన్న ట్రంప్.. కానీ భారత ప్రధాని మోదీ తనకు ఈ కొనుగోళ్లను నిలిపివేసేందుకు హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా భారత్ క్రూడ్ కొనుగోళ్లను రష్యా నుంచి ఆపలేదని దీనికి కొంత సమయం పడుతుందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించటం గమనార్హం. ట్రంప్ ఈ ప్రకటనతో అన్ని దేశాలను, ముఖ్యంగా చైనాను కూడా అదే దారిలో నడవాలని కోరుకుంటున్నారు. పైగా ఇటీవల చమురు కొనుగోలు డేటా పరిశీలిస్తే గత నెల రోజుల్లో భారత రష్యన్ చమురు దిగుమతులు 10 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ప్రభుత్వ రిఫైనరీలు దిగుమతులు తగ్గిస్తుండగా.. రిలయన్స్ వంటి ప్రైవేటు ఆటగాళ్లు దిగుమతులు పెంచినట్లు వెల్లడైంది.
భారతదేశం రష్యా నుంచి రోజుకు సుమారు 16.2 లక్షల బ్యారళ్ల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇది దేశం మొత్తం ఆయిల్ దిగుమతుల లో సుమారు మూడో వంతు. ప్రధాని మోదీ దీన్ని జాతీయ ఇంధన భద్రతకు అత్యవసర మాదిరిగా చూపిస్తూ, అమెరికా ఒత్తిడి దృష్టికి వ్యతిరేకమయ్యారు. దీనినే సాకుగా చూపిస్తూ.. ట్రంప్ గతంలో భారత్‌పై 50 శాతం వాణిజ్య పన్ను విధించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగటానికి భారత్ కారణం అంటూ బురద జల్లే ప్రయత్నం కూడా అమెరికా నుంచి జరిగింది.
అయితే ట్రంప్ ప్రస్తుత ప్రకటనతో భారత్, చైనా వంటి ప్రధాన రష్యన్ క్రూడ్ కొనుగోలుదారులను ఆపడం ద్వారా మోస్కో ఆయిల్ ఆదాయాన్ని తగ్గించాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే విధంగా భారత్ ఈ నిర్ణయం వాటి గ్లోబల్ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. నిజంగానే చిరకాల మిత్రుడు రష్యాను భారత్ పక్కన పెడుతుందా.. మోదీ నిజంగానే ట్రంప్ కి ఈ విషయంలో మాటిచ్చారా అనే విషయాలపై ప్రస్తుతం సందిగ్ధం కొనసాగుతోంది.


