వాషింగ్టన్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో గంట వ్యవధిలోనే ఏకంగా 34 పోస్టులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన చిత్రాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో కూడిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్ ద్వీపాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వరుస పోస్టులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఖర్గ్ ద్వీపాన్ని చూపిస్తూ ‘బై బై ఖర్గ్’ అంటూ ఆయన ఓ పోస్టు చేశారు. దీంతో ఇరాన్‌పై అమెరికా తదుపరి చర్యలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇరాన్ పటంపై తన ముఖం ప్రతిబింబించేలా రూపొందించిన ఓ ఏఐ చిత్రాన్ని కూడా ట్రంప్ షేర్ చేశారు. మరో పోస్టులో ‘‘చంద్రుడు మాకే సొంతం’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ట్రంప్ వరుస పోస్టులతో ఆయన సోషల్ మీడియా ఖాతా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్, ఖర్గ్ ద్వీపానికి సంబంధించిన పోస్టులపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అలాగే న్యూమెక్సికో రాష్ట్రాన్ని ‘న్యూఅమెరికా’గా పేర్కొంటూ ఓ మ్యాప్‌ను తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేశారు. న్యూమెక్సికో మ్యాప్‌లో ఉన్న ‘మెక్సికో’ పదాన్ని కొట్టివేసి.. దాని కింద ‘అమెరికా’ అని చేర్చిన చిత్రం అందులో కనిపించింది. అయితే ఈ మ్యాప్‌ను ఎందుకు పోస్ట్ చేశారనే దానిపై ట్రంప్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వైట్‌హౌస్ కూడా ఇదే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అదనపు వివరణ లేకుండా షేర్ చేసింది. కెనడాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఒంటారియో సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మార్చాలని ట్రంప్ ఇటీవల ఆదేశించిన కొద్దిరోజులకే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.
క్యాథీ హోకుల్ సరస్సు పేరును మార్చబోం
ట్రంప్ ఆదేశాల అనంతరం అమెరికా ప్రభుత్వ ‘జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’లో సరస్సు పేరు అధికారికంగా మారడంతో తమ మ్యాప్స్ యాప్‌లోనూ మార్పు చేసినట్లు గూగుల్ తెలిపింది. అమెరికాలో మ్యాప్స్ వినియోగించే వారికి ‘లేక్ అమెరికా’గా, కెనడాలో ఉన్న వారికి ‘లేక్ ఒంటారియో’గానే కనిపిస్తుందని, అమెరికా-కెనడా వెలుపల ఉన్న వారికి రెండు పేర్లు కనిపిస్తాయని గూగుల్ వివరించింది. అయితే ట్రంప్ ఆదేశం వెలువడిన కొన్ని గంటల్లోనే కెనడా ప్రధాని మార్క్ కార్నీ, న్యూయార్క్ గవర్నర్, డెమొక్రాట్ నాయకురాలు క్యాథీ హోకుల్ సరస్సు పేరును మార్చబోమని స్పష్టం చేశారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ సరస్సు పేరును మార్చడం కుదరదని వారు పేర్కొన్నారు. లేక్ ఒంటారియో ఉపరితల విస్తీర్ణంలో సుమారు 52 శాతం కెనడాలో ఉండగా.. మిగిలిన భాగం న్యూయార్క్‌లో ఉంది.
గతంలో ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా గల్ఫ్ ఆఫ్ మెక్సికో
2025 జనవరిలోనూ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాలని ఆదేశించారు. అనంతరం గూగుల్, యాపిల్ తమ మ్యాప్స్ యాప్‌లలో అమెరికా వినియోగదారుల కోసం పేరును మార్చాయి. తాజా మ్యాప్ పోస్ట్ వెలువడిన సమయంలో ట్రంప్‌కు నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలు కీలక పరీక్షగా మారనున్నాయి. ఇటీవల రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ అధ్యక్ష పనితీరుకు 33 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఇది ఆయన రాజకీయ జీవితంలోనే అత్యల్ప ఆమోద రేటుగా నిలిచింది. ఇదిలా ఉండగా.. ప్రతినిధుల సభ, సెనేట్‌లో స్వల్ప మెజారిటీలను కాపాడుకునేందుకు రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తోంది.

