Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్student visa : అగ్రరాజ్యం కొరడా.. 6 వేల మంది విద్యార్థుల వీసాలు రద్దు!

student visa : అగ్రరాజ్యం కొరడా.. 6 వేల మంది విద్యార్థుల వీసాలు రద్దు!

US crackdown on foreign student visas : ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన వేలాది మంది విదేశీ విద్యార్థుల ఆశలపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 6 వేల మంది వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న కీలక తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల్లో కలకలం రేపుతోంది. అసలు ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఎందుకు రద్దు చేశారు..? వారిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలేంటి..? ఈ కఠిన చర్యల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి.?

- Advertisement -

అమెరికాలో నిబంధనలను ఉల్లంఘించిన 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అక్కడి విదేశాంగ శాఖ అధికారులు ధ్రువీకరించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచి విదేశీయుల విషయంలో, ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించే విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రద్దు చేసిన వీసాల వెనుక బలమైన కారణాలున్నాయని అధికారులు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.

ఆరోపణల చిట్టా  : వీసాలు రద్దయిన వారిలో సుమారు 4,000 మంది విద్యార్థులు తీవ్రమైన నేర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో దాడులు చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం (మత్తులో డ్రైవింగ్‌), దోపిడీలకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, వీరిలో దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలను ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారన్న కారణంతో రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వివరించింది. ఇది అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది.

ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరి : అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచే అమెరికా ఉన్నత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులపై నిఘా పెంచారు.

పాలస్తీనాకు మద్దతిస్తే బహిష్కరణ: విశ్వవిద్యాలయాల్లో యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ఈ ఏడాది జనవరిలో ఓ బిల్లును పాస్ చేశారు. దీని ప్రకారం, అంతర్జాతీయ విద్యార్థులు ఎవరైనా పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే, వారిని దేశం నుంచి బహిష్కరించేలా కఠిన చట్టాలను అమలులోకి తెచ్చారు.

సోషల్ మీడియాపై జల్లెడ: వీసా దరఖాస్తు ప్రక్రియలో సోషల్ మీడియా వెట్టింగ్‌ను అత్యంత కఠినతరం చేశారు. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. వారి పోస్టులు, కామెంట్లు, లైక్‌లను నిశితంగా పరిశీలించిన తర్వాతే, వారు దేశ భద్రతకు ముప్పు కాదని భావిస్తేనే వీసా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

కొత్త ఇంటర్వ్యూల నిలిపివేత: ఈ ఏడాది జూన్‌లో విదేశీ విద్యార్థుల కోసం కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఓపెన్ డోర్స్’ సంస్థ గణాంకాల ప్రకారం, 2023-24 విద్యా సంవత్సరంలో 210కి పైగా దేశాల నుంచి 11 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad