US-India tariff dispute : అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో అమెరికా ఒంటరవుతోందా..? తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు సుంకాలనే ఆయుధంగా ప్రయోగిస్తున్న వేళ.. రష్యా, భారత్ వంటి దేశాలు ఏకమై ఎదురు తిరుగుతున్నాయి. ఈ పరిణామాల వెనుక అసలు వ్యూహం ఏమిటి…? మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో ఇది దేనికి సంకేతం..?
ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) పై తన పట్టు జారుతోందన్న నిజాన్ని జీర్ణించుకోలేక అమెరికా ‘నయా వలసవాద’ విధానాలను అవలంబిస్తోందని రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఏకపక్ష సుంకాలు, ఆంక్షల ద్వారా చరిత్ర గమనాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. తమకు బ్రిక్స్ దేశాల అండ పుష్కలంగా ఉందని ప్రకటించి, వాషింగ్టన్‌కు గట్టి సందేశం పంపింది. మరోవైపు, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులను భారత్ అంతే దీటుగా తిప్పికొట్టింది.
ఆధిపత్యం కోసం అమెరికా ఆరాటం: అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నప్పటికీ, ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్వతంత్ర విదేశాంగ విధానాలు కలిగిన దేశాలను రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు గురిచేస్తోందని ఆమె విమర్శించారు.
“ఇది గ్లోబల్ సౌత్ దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడి, వారి అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నమే” అని జఖరోవా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన పాశ్చాత్య దేశాలే ఇప్పుడు రాజకీయ ప్రేరేపిత రక్షణాత్మక విధానాలను, సుంకాల అవరోధాలను సృష్టిస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు.
మాకు ‘బ్రిక్స్’ అండ ఉంది: రష్యా ధీమా : ఎన్ని సుంకాల యుద్ధాలు చేసినా, ఆంక్షలు విధించినా చరిత్ర సహజ గమనాన్ని ఆపలేవని తాము బలంగా విశ్వసిస్తున్నామని మరియా జఖరోవా తెలిపారు. తమకు ప్రపంచవ్యాప్తంగా అనేక మిత్రదేశాలు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్, బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మద్దతు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలను ప్రతిఘటించడానికి, సమానత్వంతో కూడిన బహుళపక్ష ప్రపంచ వ్యవస్థ ఏర్పాటుకు తమ దేశం కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు.
భారత్‌పై మళ్ళీ ట్రంప్ అక్కసు : మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ లాభాలు గడిస్తోందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలను భవిష్యత్తులో మరింత గణనీయంగా పెంచుతామని హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
నిప్పులు చెరిగిన భారత్.. గట్టిగా బదులు : ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టింది. “భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం, అర్థరహితం” అని భారత విదేశాంగ శాఖ తీవ్ర ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా, దేశ ఇంధన భద్రత అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది.తమను విమర్శిస్తున్న దేశాలే, ఎలాంటి జాతీయ అవసరం లేకపోయినా రష్యాతో బిలియన్ల కొద్దీ వాణిజ్యం చేస్తున్నాయని, ఇది వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని భారత్ ఎత్తిచూపింది.దేశ ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.


