US security guarantees for Ukraine : ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతూనే, అమెరికా ఓ కీలకమైన మెలిక పెట్టింది. మా సైన్యం మీ గడ్డపై అడుగుపెట్టదు, కానీ మీకు రక్షణ కవచంలా ఉంటామంటోంది. అసలు సైన్యాన్ని పంపకుండా భద్రత కల్పించడం ఎలా సాధ్యం..? “గగనతల రక్షణ” పేరిట అగ్రరాజ్యం వేయబోతున్న ఎత్తుగడ ఏమిటి..? డొనాల్డ్ ట్రంప్ అసలు వ్యూహం ఏంటి..?
ఉక్రెయిన్‌కు ఇస్తామన్న భద్రతా హామీలపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ భూభాగంలోకి అమెరికా సైనికులను పంపే ప్రసక్తే లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెరోలిన్ లీవిట్ వెల్లడించారు. అయితే, సైన్యాన్ని పంపడం మినహా గగనతల రక్షణ వంటి ఇతర మార్గాల్లో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ఆమె పరోక్షంగా సంకేతాలిచ్చారు. “ఉక్రెయిన్‌కు అమెరికా గగనతల రక్షణ కల్పిస్తుందా?” అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, “ఆ అవకాశం ఉంది” అని ఆమె బదులివ్వడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది.
భద్రతా హామీలే శాంతికి పునాది : ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక శాంతి నెలకొనాలంటే, కేవలం యుద్ధ విరమణ ఒప్పందం సరిపోదని, పటిష్టమైన భద్రతా హామీలే కీలకమని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని లీవిట్ తెలిపారు. ఈ హామీలను ఎలా అమలు చేయాలనే దానిపై ఆమోదయోగ్యమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ట్రంప్ తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో ఐరోపాలోని మిత్రదేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, రష్యా, ఉక్రెయిన్‌లతో కూడా అమెరికా చర్చలు కొనసాగిస్తోందని ఆమె వివరించారు.
ఆయుధాలు కొనాల్సింది నాటో.. అమెరికా కాదు : “ఉక్రెయిన్ కోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎందుకు ఖర్చు చేస్తున్నారు?” అన్న ప్రశ్నకు లీవిట్ బదులిస్తూ, ట్రంప్ వ్యూహాన్ని బయటపెట్టారు. ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలను అమెరికా కాకుండా, నాటో కూటమే కొనుగోలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారని ఆమె తెలిపారు. “అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ అమెరికా ప్రజల సొమ్మును కాపాడే పనిలోనే ఉన్నారు. ప్రపంచంలోని ప్రతీ పనికి గుడ్డిగా నిధులు మంజూరు చేసే పాత పద్ధతికి ఆయన స్వస్తి పలికారు. యుద్ధాలను దౌత్యంతో ఎలా ఆపాలో ఆయనకు బాగా తెలుసు” అని లీవిట్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ చొరవతోనే శాంతి చర్చలు : గత అమెరికా ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ట్రంప్ వచ్చాకే శాంతి చర్చలు ఊపందుకున్నాయని లీవిట్ అన్నారు. గాజా నుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించిన ఘనత కూడా ట్రంప్‌దేనని ఆమె గుర్తుచేశారు. శాంతి స్థాపన కోసం ట్రంప్ అనేకసార్లు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారని, గత శుక్రవారం నేరుగా భేటీ అయ్యారని తెలిపారు. ట్రంప్ నిరంతర ప్రయత్నాల వల్లే ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌లు చర్చలకు అంగీకరించాయని, ఇరు దేశాలు కొన్ని అంశాల్లో రాజీ పడి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆకాంక్షిస్తున్నారని ఆమె వివరించారు.


