Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్US-Venezuela : యుద్ధ మేఘాలు.. వెనిజులాపై అమెరికా పంజా!

US-Venezuela : యుద్ధ మేఘాలు.. వెనిజులాపై అమెరికా పంజా!

US-Venezuela military tensions :  దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చమురు సంపన్న దేశం వెనిజులా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారన్న వార్తలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిహద్దుల్లో ఫైటర్ జెట్ల మోహరింపుతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అసలు ఈ వివాదానికి కారణమేంటి…? డ్రగ్స్ మాఫియా పేరుతో అమెరికా రచిస్తున్న వ్యూహం వెనుక అసలు లక్ష్యం వెనిజులా చమురేనా..?

- Advertisement -

మదురో గద్దె దింపడమే లక్ష్యం : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికార పీఠం నుంచి దించివేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం, ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్య దిశగా మళ్లుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సరిహద్దుల్లో సైనిక మోహరింపు: ఈ వ్యూహంలో భాగంగా, అమెరికా తన అత్యాధునిక 10 F-35 ఫైటర్ జెట్లను వెనిజులా సరిహద్దుల్లో మోహరించింది. ఈ చర్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వాతావరణం నెలకొంది.  అమెరికా ఈ చర్యను కేవలం హెచ్చరికగానే పరిమితం చేస్తుందా లేక నిజంగానే దాడికి దిగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కారణం డ్రగ్స్.. లక్ష్యం చమురా : అమెరికా తన చర్యలను సమర్థించుకునేందుకు డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

అమెరికా ఆరోపణ: తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా అవ్వడానికి అధ్యక్షుడు మదురోనే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, వెనిజులాలోని డ్రగ్స్ కార్టెళ్లపై సైనిక దాడులు (మిలిటరీ స్ట్రైక్) చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

వెనిజులా ప్రత్యారోపణ: అయితే, అమెరికా ఆరోపణలను వెనిజులా తీవ్రంగా ఖండిస్తోంది. డ్రగ్స్ అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, వెనిజులాలోని అపారమైన చమురు నిక్షేపాలను దోచుకోవడానికే అమెరికా ఈ కుట్రలకు పాల్పడుతోందని మదురో ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ, సరిహద్దుల్లో సైనిక కదలికలు పెరగడంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad