Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్US Visa : అగ్రరాజ్యంలో వీసా బాండ్‌.. 15,000 డాలర్లు కడితేనే ప్రవేశం!

US Visa : అగ్రరాజ్యంలో వీసా బాండ్‌.. 15,000 డాలర్లు కడితేనే ప్రవేశం!

 US visa bond program : అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అగ్రరాజ్యం, ఇప్పుడు వీసా ఆశావహుల నెత్తిన మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. పర్యాటక, వ్యాపార వీసాలపై అమెరికా వెళ్లాలంటే ఏకంగా 15,000 డాలర్ల (సుమారు రూ. 12.5 లక్షలు) వరకు పూచీకత్తు (బాండ్‌) చెల్లించాల్సిందేనని సంచలన ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కొత్త నిబంధన ఎవరికి వర్తిస్తుంది? ఏ దేశాల వారికి ఈ బాండ్‌ సెగ తగలనుంది..? కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా..? ఈ కఠిన నిబంధన వెనుక ఉన్న అసలు వ్యూహమేమిటి..?

- Advertisement -

ఏమిటీ పైలట్ ప్రోగ్రామ్ : అమెరికా విదేశాంగ శాఖ “వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్” పేరుతో ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం, బీ-1 (బిజినెస్ వీసా), బీ-2 (టూరిస్ట్ వీసా) కోసం దరఖాస్తు చేసుకునే వారు వీసా మంజూరు కావాలంటే భారీ మొత్తంలో బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ బాండ్‌ మొత్తం 5,000, 10,000, లేదా 15,000 డాలర్లుగా ఉండొచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు. 12 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారిక నోటీసు వెలువడిన 15 రోజుల్లోనే ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

డబ్బులు వెనక్కి వస్తాయా : ఈ బాండ్‌ విధానంలో ఒక కీలకమైన షరతు ఉంది. వీసా పొందిన వ్యక్తి, అమెరికాలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని, వీసా గడువు ముగిసిన వెంటనే దేశం విడిచి వెళితే, వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా నివసిస్తే మాత్రం బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తారు. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. దేశంలోకి వచ్చి అక్రమంగా ఉండిపోకుండా నిరోధించడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశం.

ఎవరికి మినహాయింపు : అయితే, ఈ బాండ్‌ నిబంధన ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వర్తించదు. ఈ నిబంధనలు ఏయే దేశాలకు వర్తిస్తాయో తెలియజేసే జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలో ప్రకటిస్తుంది. ముఖ్యంగా, అమెరికా వీసా వేవర్ ప్రోగ్రామ్ (VWP)లో ఉన్న 42 దేశాలకు ఈ బాండ్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ జాబితాలో అధికంగా ఐరోపా దేశాలతో పాటు ఆసియా, మధ్యప్రాచ్యానికి చెందిన కొన్ని దేశాలున్నాయి. అంతేకాకుండా, దరఖాస్తుదారుడి ప్రత్యేక పరిస్థితులను బట్టి కాన్సులర్ అధికారి బాండ్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఎందుకీ కఠిన నిబంధన : టూరిస్ట్, బిజినెస్ వీసాలపై దేశంలోకి ప్రవేశిస్తున్న వారిలో చాలా మంది గడువు ముగిసినా తిరిగి వెళ్లడం లేదని, ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఇలాంటి అక్రమ వలసలను అరికట్టేందుకే ఈ బాండ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, 2020 నవంబరులో కూడా ఇలాంటి పైలట్ ప్రాజెక్టునే ప్రవేశపెట్టారు. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణాలు స్తంభించిపోవడంతో అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad