Wednesday, July 16, 2025
Homeఇంటర్నేషనల్US Warning to Foreign Students : విదేశీ విద్యార్థులకు వార్నింగ్!

US Warning to Foreign Students : విదేశీ విద్యార్థులకు వార్నింగ్!

VISA ALERT : విదేశీ విద్యార్థుల వీసా మార్గంలో మళ్లీ మళ్లీ అడ్డంకులు! ఫారిన్ విద్యార్థుల కోసం ట్రంప్ ప్రభుత్వం వీసా దరఖాస్తులు తిరిగి తెరిచినా.. కొత్త నియమాలతో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా తనిఖీలు, గడువు పరిమితులతో కూడిన ఈ మార్పులు చేర్పులు విద్యార్థుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి?

- Advertisement -

 వీసా ద్వారం తెరిచిన అమెరికా: కొత్త ఆశలు, కొత్త ఆంక్షలు : దాదాపు నెలరోజుల సస్పెన్షన్‌ తర్వాత, ఎందరో విదేశీ విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న అమెరికా విద్యార్థి వీసా దరఖాస్తుల స్వీకరణను జూన్ 18, 2025న అమెరికా విదేశాంగ శాఖ తిరిగి ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చినప్పటికీ, ఈ అవకాశంతో పాటు కొన్ని కఠినమైన నిబంధనలు కూడా అమలులోకి వస్తున్నాయి.

విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ ఒక కీలక ప్రకటనలో, “విద్యార్థి వీసా అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, దీనిని కేవలం చదువుకోవడానికే వాడాలి. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటి పనులు చేయొద్దు” అని స్పష్టం చేశారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. అమెరికా విద్యాసంస్థలు విదేశీ విద్యార్థుల ద్వారా ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాయి కాబట్టి, ఈ నిర్ణయం ఆర్థికంగా కూడా కీలకమైనది.

సోషల్ మీడియా తనిఖీ: విద్యార్థులకు కొత్త సవాలు: వీసా దరఖాస్తు ప్రక్రియ పునరాగమనానికి ముందే, సోషల్ మీడియా వెట్టింగ్‌కు సంబంధించిన కొత్త ఆదేశాలు విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను ‘పబ్లిక్’ వ్యూ ఆప్షన్‌లో ఉంచాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియమాన్ని పాటించకపోతే, అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుందని, అంతేకాకుండా భవిష్యత్‌లో అమెరికా ప్రవేశం కోల్పోయే అవకాశం ఉందని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

జాతీయ భద్రతను కాపాడేందుకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది విద్యార్థుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని, సోషల్ మీడియాలో పెట్టే సాధారణ పోస్టులు కూడా వీసా తిరస్కరణకు దారి తీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గడువు పరిమితి ప్రతిపాదన:  మరో ఆశ్చర్యకరమైన మరియు ఆందోళనకరమైన మార్పు ఏమిటంటే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విద్యార్థి వీసాలకు (F-1, J-1) కాల గడువు పరిమితిని ప్రతిపాదించింది. ప్రస్తుతం F-1 వీసా గడువు సాధారణంగా విద్యార్థి కోర్సు పూర్తయ్యేంత వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉంటుంది.

అయితే, ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, గడువు ముగిసిన తర్వాత విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌కు (OMB) పంపబడింది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే, విద్యార్థులు తరచుగా తమ వీసాలను రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఇది ఆర్థికంగా, మానసికంగా అదనపు భారాన్ని మోపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు F-1, J-1 వీసాలపై ఉన్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

విద్యార్థుల పరిస్థితి: ఆందోళనలు పెరుగుతున్నాయి: ఈ కొత్త నియమాలతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వీసా తిరస్కరణ జరిగే అవకాశం, గడువు పరిమితులతో వచ్చే అసౌకర్యాలు వారి చదువుకు, భవిష్యత్తుకు ముప్పు తెస్తున్నాయి.

ఈ విషయమై.. “చదువుకోవడానికి వెళ్తున్నాం, కానీ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ అనుమానంగా చూస్తున్నట్లు ఉంది” అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను లోతుగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. వీసా దరఖాస్తు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News