Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్US visa rules : వీసా గడువు దాటితే వేటే!.. భారతీయులకు అగ్రరాజ్యం హెచ్చరిక!

US visa rules : వీసా గడువు దాటితే వేటే!.. భారతీయులకు అగ్రరాజ్యం హెచ్చరిక!

US visa rules for Indians : అగ్రరాజ్యమైన అమెరికా నుండి భారతీయులకు వరుసగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఒకవైపు సుంకాల యుద్ధానికి  అధ్యక్షుడు ట్రంప్ తెరలేపుతుంటే, మరోవైపు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఉక్కుపాదం మోపింది. ఇదే సమయంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు భారతీయ హెచ్‌1బీ వీసాలపై అక్కసు వెళ్లగక్కారు. ఈ వరుస పరిణామాలు దేనికి సంకేతం..? ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక భారత్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమా..? ఈ పరిణామాల పూర్తి వివరాలేమిటి..?

- Advertisement -

నిబంధనలు గౌరవించండి.. లేదంటే : భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ‘ఎక్స్’  వేదికగా భారత పౌరులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. వీసాపై పేర్కొన్న అధికారిక గడువు (I-94 Admit Until Date‌) ముగిసిన తర్వాత దేశంలో ఉండటం చట్టవిరుద్ధమని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

“మీ వీసా నిబంధనలను గౌరవించండి. చట్టబద్ధ గడువు మించిపోతే వీసా రద్దు, దేశ బహిష్కరణ (డిపోర్టేషన్), భవిష్యత్తులో వీసా పొందే అర్హతను శాశ్వతంగా కోల్పోవచ్చు. తద్వారా మీరు తిరిగి అమెరికాకు ప్రయాణించడం, చదువుకోవడం లేదా పనిచేయడం వంటి అవకాశాలను కోల్పోతారు” అని ఎంబసీ తన పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొంది. అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని అరికట్టే ప్రణాళికలో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

హెచ్‌1బీ వీసాలపై విమర్శల దాడి : అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసిన కొద్దిసేపటికే, జార్జియా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ భారతీయ హెచ్‌1బీ వీసాలపై తీవ్ర విమర్శలు చేశారు. “భారతీయ H1-B వీసాలను ఆపండి. అవి అమెరికన్ల ఉద్యోగాలను దోచుకుంటున్నాయి” అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. అమెరికాలో ఇటీవల హెచ్‌1బీ వీసాల విషయంలో, ప్రత్యేకించి భారతీయుల పెరిగిపోతున్న ప్రాబల్యంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

ట్రంప్ సుంకాల గర్జన : ఈ వీసా హెచ్చరికలకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్‌లో మరణిస్తున్న ప్రజల గురించి భారత్‌కు బాధ లేదని ఆరోపించారు. అందుకే భారత్‌పై విధించే సుంకాలను భారీగా పెంచుతానని ఆయన హెచ్చరించారు.

అయితే, ట్రంప్ విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ఇంధన భద్రతను కల్పించడం తమ జాతీయ ప్రయోజనాల్లో భాగమని, అందుకోసమే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ విమర్శలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఈ సుంకాల ఉద్రిక్తతల నడుమ వీసా నిబంధనలపై హెచ్చరికలు రావడం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad