Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్IAS officer: ఐఏఎస్‌గా ఎంపికైన పకోడీ వాలా కూతురు.. సక్సెస్‌ స్టోరీ వింటే వావ్‌ అనాల్సిందే..!

IAS officer: ఐఏఎస్‌గా ఎంపికైన పకోడీ వాలా కూతురు.. సక్సెస్‌ స్టోరీ వింటే వావ్‌ అనాల్సిందే..!

Uttar Pradesh Pakoda sellers daughter clears UPSC to become IAS officer: తల్లిదండ్రులు తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదని ఉన్నత చదువులు చదివిస్తారు. అహర్నిషలు కష్టపడి వారిని ప్రయోజకుల్ని చేస్తారు. అయితే, తల్లిదండ్రుల మాట వినకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి కొంతమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటే.. మరికొందరు మాత్రం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులకు గుర్తింపును తీసుకొస్తారు. కడు బీదరికంలోనూ ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థానాలకు చేరుకొని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిన వారెందరో. అలాంటి కేటిగిరీకి చెందిన వారే రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్‌ అటల్ బంద్ ఏరియాకి చెందిన గోవింద్ కుమార్ పిల్లలు. పేదరికంతో పోరాడుతూ.. పకోడీ అమ్ముతూ తమని పెంచిన తండ్రిని గెలిపించిన పిల్లలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పిల్లలో ఒకరు ఐఏఎస్, ముగ్గురు డాక్టర్లు కావడం విశేషం.

- Advertisement -

తండ్రి కష్టాన్ని చూసి, కుటుంబ పరిస్థితిని మార్చి..

వివరాల్లోకి వెళ్తే.. గోవింద్‌ కుమార్‌ రోడ్డుపై తోపుడుబండి పెట్టుకుని పకోడీ వంటి చిరుతిళ్లు అమ్మేవాడు. ఆ చిన్నపాటి తోపుడు బండితో వచ్చిన ఆదాయంతోనే గోవింద్ కుమార్ తన భార్య, నలుగురు పిల్లలని పోషించేవాడు. తన కుటుంబం కోసం ఎండనక వాననక కష్ట పడేవాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన ఈ పకోడీవాలా కూతురే నేడు జార్ఖండ్ కేడర్ ఐఎఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి. ఆరుగురు సభ్యుల కుటుంబం.. పరిమిత వనరులతో ఒకే చిన్న గదిలో నివసించింది. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. దిపేష్‌ కుమారి తండ్రి తన పిల్లల చదువుకి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చేవాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన దీపేష్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. ఆమె భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో చదివి 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% తో ఉత్తీర్ణత సాధించారు. తర్వాత జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌, ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్‌ పట్టా పొందారు. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీతో ఉద్యోగంలో చేరారు. ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత జాబ్ వదిలేసిన దీపేష్ సివిల్ సర్వెంట్ కావాలనే తన కలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. 2020లో ఆమె మొదటి ప్రయత్నం విఫలం కాగా.. దీపేష్ నిరాశ పడలేదు. మళ్ళీ తాను పొదుపుగా దాచుకున్న డబ్బుని ఉపయోగించి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లి మళ్ళీ యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం అయ్యారు.

దిపేష్‌ స్పూర్తితో కుటుంబంలో ముగ్గురు డాక్టర్లు..

2021లో దీపేష్ కృషికి ఫలితం దక్కింది. దీపేష్ యూపీఎస్సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్ సాధించి, EWS (ఆర్థికంగా వెనబడిన తరగతులు) విభాగంలో 4వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆమె ఐఏఎస్‌ అధికారిణిగా జార్ఖండ్ కేడర్‌కు నియమితులైంది. ఐఏఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి ప్రస్తుతం జార్ఖండ్ రోడ్డు రవాణా, హైవేస్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఆఫీసర్‌గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. తండ్రి కష్టం, దీపేష్ విజయం చూస్తూ పెరిగిన ఆమె తోబుట్టువులు కూడా ఏదైనా సాధించాలనే స్ఫూర్తి కలిగింది. దీపేష్ చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులను నిర్వహిస్తుండగా.. ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్‌లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు, మరొక సోదరుడు లాతూర్‌లో ఎంబిబిఎస్ చదువు కొనసాగిస్తున్నాడు. దీపేష్‌ ఐఏఎస్ ఆఫీసర్ గా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ అని చెప్పారు. తాను అలసిపోయినప్పుడల్లా.. తండ్రి పోరాటం తనకు ప్రేరణనిచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పరిస్థితులతో పనిలేదని.. కృషి పట్టుదల అంకిత భావం ఉంటే ఎలాంటి పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని తెలిపారు. నేటి యువతకు దీపేష్ ప్రేరణగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad