Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Ukraine security : ఉక్రెయిన్ భారం.. ఐరోపాదే భుజస్కంధం!

Ukraine security : ఉక్రెయిన్ భారం.. ఐరోపాదే భుజస్కంధం!

Europe’s responsibility in Ukraine war : మూడేళ్లుగా ఉక్రెయిన్‌కు అండగా ఉన్న అమెరికా, ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని రష్యాకు అనుకూలంగా మారిందా..?  ఉక్రెయిన్ భద్రతా బాధ్యతల నుంచి నెమ్మదిగా తప్పుకుంటోందా..? “ఆ భారం మాది కాదు, మీదే” అంటూ ఐరోపా దేశాలకు తేల్చిచెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి..? అసలు, అగ్రరాజ్యం ఈ ఆకస్మిక వైఖరి మార్పు వెనుక ఉన్న వ్యూహమేమిటి…? ఈ నిర్ణయం యుద్ధ గతిని ఎలా ప్రభావితం చేయనుంది..? 

- Advertisement -

ఐరోపాదే ప్రధాన బాధ్యత: జేడీ వాన్స్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ భద్రతను కాపాడటంలో ప్రాథమిక బాధ్యత ఐరోపా దేశాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. “భౌగోళికంగా ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్నది ఐరోపా దేశాలు. ప్రత్యక్ష భద్రతా ప్రయోజనాలు ముడిపడి ఉన్నది వారితోనే. కాబట్టి, ఆ బాధ్యతలో సింహభాగం వారే మోయాలి. యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలకు మేం మద్దతిస్తాం, కానీ యుద్ధానంతర ఆర్థిక సహాయం, భద్రతా హామీల భారాన్ని మేం మోయాలని అనుకోవడం లేదు. ఇది వారి ఖండం, వారి భద్రత. వారే ముందడుగు వేయాలి,” అని వాన్స్ స్పష్టం చేశారు.

ట్రంప్ మాటే.. సైన్యం పంపేది లేదంతే : అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే, ఉపాధ్యక్షుడు వాన్స్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ గడ్డపైకి అమెరికా సైన్యాన్ని పంపే ప్రసక్తే లేదని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెరోలిన్ లీవిట్ వెల్లడించారు. అయితే, గగనతలం నుంచి మద్దతు వంటి ఇతర ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఉక్రెయిన్‌కు ఎలాంటి సైనిక సహాయం అందించాలన్న తుది నిర్ణయం అధ్యక్షుడిదేనని, ఐరోపా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూనే ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, ఆ బాధ్యతను ఐరోపా దేశాలు తీసుకోవాలని వాన్స్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆయుధాల ఖర్చు నాటోదే : ఈ విధానపరమైన మార్పునకు అనుగుణంగా, ట్రంప్ సర్కార్ జులైలోనే నాటోతో ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇకపై అమెరికా ఉక్రెయిన్‌కు పంపే ఆయుధాలకు అయ్యే పూర్తి ఖర్చును నాటో భరించాల్సి ఉంటుంది. అమెరికా ఆయుధాలను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా, నాటో ద్వారా పంపిస్తుంది. ఆ ఖర్చును కూడా నాటోనే భరిస్తుంది. తద్వారా అమెరికాపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

మొత్తం మీద, ఉక్రెయిన్ విషయంలో అమెరికా తన పాత్రను ‘ప్రత్యక్ష భాగస్వామి’ నుంచి ‘వ్యూహాత్మక మద్దతుదారు’గా మార్చుకుంటోంది. ఆర్థిక, సైనిక భారాన్ని ఐరోపా దేశాల భుజస్కంధాలపైకి నెడుతూ, తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ఈ మార్పు రానున్న రోజుల్లో నాటో కూటమిలో, అలాగే యుద్ధ క్షేత్రంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad