పాకిస్తాన్ రవాణా శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) భారత్‌పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను(Sindhu River) పాక్ రాకుండా అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని ఓ ఇంటర్వ్యూలో ఖవాజాను మీడియా ప్రశ్నించింది. ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సమయం గడిచే కొద్ది యుద్ధం జరగడానికి అవకాశాలు పెరుగుతున్నాయని.. ఆ పరిస్థితి రాకుండా ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నా భారత్ విననడం లేదన్నారు. యుద్ధం జరుగకుండా ఆ దేవుడే ఆపాలి అని వ్యాఖ్యానించారు.
ఒకవేళ భారత్ దాడికి పాల్పడితే.. తమ ప్రతిదాడి అంతకు మించి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అబ్దాలీ బాలిస్టిక్ మిసైల్‌ను తాజాగా పరీక్షించింది. అంతేకాకుండా తొమ్మిది రోజుల నుంచి సరిహద్దుల వెంబడి కాల్పులకూ కూడా తెగబడుతోంది. ఈ కాల్పులకు భారత ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తోంది.