ట్రంప్ గోల్డ్ కార్డ్
ఈ కార్డు వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. దీని ధర ఏకంగా $1 మిలియన్ (సుమారు రూ. 8.8 కోట్లు). ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యాన్ని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదం తెలుపుతుంది. ఆమోదం పొందిన వారు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు.
ట్రంప్ ప్లాటినం కార్డ్
ఇది కూడా వ్యక్తులకే అయినప్పటికీ, మరింత సంపన్నులను లక్ష్యంగా చేసుకుంది. దీని ధర $5 మిలియన్లు (సుమారు రూ. 44 కోట్లు). ఈ కార్డు పొందిన వారు అమెరికాలో ఏడాదికి 270 రోజుల వరకు నివసించవచ్చు. ఈ సమయంలో వారి విదేశీ ఆదాయంపై అమెరికాలో ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది అత్యంత సంపన్నులను ఆకర్షించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్
విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీల కోసం ఈ కార్డును రూపొందించారు. దీని ధర $2 మిలియన్లు (సుమారు రూ. 17.6 కోట్లు). దీనికి అదనంగా వార్షిక నిర్వహణ రుసుము కూడా ఉంటుంది. ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక ఉద్యోగి మానేసి వెళ్ళిపోతే, అదే కార్డును ఫీజు చెల్లించి, కొత్త ఉద్యోగికి బదిలీ చేయవచ్చు.ఈ నిర్ణయాలు న్యాయపరమైన సవాళ్లను తట్టుకొని నిలబడితే, అమెరికా వెళ్లాలనుకునే వారిపై ఊహకందని ఆర్థిక భారం పడనుంది. కేవలం $215 డాలర్లుగా ఉన్న నైపుణ్య కార్మికుల వీసా ఫీజు ఇప్పుడు లక్ష డాలర్లకు చేరడం, ప్రతిభ కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త విధానం ఉండటం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.


