Is India the Indo-Pacific’s Game Changer : భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందా? ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, స్థిరత్వానికి భారత్‌ను అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు వైట్ హౌస్ చేసిన ప్రకటన, అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న “వ్యక్తిగత అనుబంధాన్ని” కూడా వైట్ హౌస్ కొనియాడింది.
దీనికి తోడు, ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలైన్ లీవిట్ వెల్లడించారు. అసలు ఈ ‘సన్నిహిత అనుబంధం’ ఇండో-పసిఫిక్ భద్రతకు ఎలా దోహదపడుతుంది? భారత్‌కు ఈ వాణిజ్య ఒప్పందం ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చబోతోందో..? వివరంగా తెలుసుకుందాం..
వైట్ హౌస్ ప్రకటన: భారత్ కీలక పాత్ర : జూలై 1, 2025న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలైన్ లీవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతను నిర్ణయించడంలో భారత్ అత్యంత కీలక భూమిక పోషిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రధానమంత్రి మోదీ మధ్య వ్యక్తిగతంగా చాలా సన్నిహిత అనుబంధం ఉంది, ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రకటన భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారానికి కొత్త దిశను సూచిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం ప్రాంతీయ భద్రతకు మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన ఆవశ్యకత : ఈ కీలక ప్రకటన వెలువడిన సమయంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో “ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం” ఎగ్జిబిషన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన, వైట్ హౌస్ ప్రకటనతో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నారు.
ఈ పర్యటన భారత్-అమెరికా మధ్య రాజకీయ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. జైశంకర్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలకు, భవిష్యత్ కార్యాచరణకు వేదిక కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వాణిజ్య ఒప్పందం: తుదిమెరుగులకు చేరుకున్న చర్చలు : వాణిజ్య ఒప్పందంపై కెరోలైన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు భారత ఆర్థిక వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. “అధ్యక్షుడు ట్రంప్ గత వారమే భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉందని పేర్కొన్నారు.
నేను కామర్స్ సెక్రటరీతో జరిగిన చర్చలను స్వయంగా చూశాను. ఈ ఒప్పందం త్వరలో అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది” అని ఆమె తెలిపారు. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు, ఆర్థిక వృద్ధికి భారీగా ఊతమిస్తుందని, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టపడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో విస్తృత అవకాశాలను కల్పిస్తుంది.
క్వాడ్ సమ్మిట్: ట్రంప్ హాజరుకు సుముఖత: ఈ ఏడాది చివరిలో దిల్లీలో జరగనున్న QUAD (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. దీనికి ట్రంప్ సానుకూల స్పందన ఇవ్వడం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం.
భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రి పేర్కొన్నట్లుగా, ఇటీవల గ్లోబల్ జీ7 సమ్మిట్ సమయంలో జరిగిన ఫోన్ కాల్‌లో ఈ ఆహ్వానం జరిగింది. QUAD కూటమి 2004లో సునామీ సమయంలో మానవతా సాయంతో మొదలై, ఇప్పుడు భద్రత, సముద్ర నిర్వహణ, అత్యాధునిక టెక్నాలజీలపై దృష్టి సారిస్తూ ఇండో-పసిఫిక్‌లో కీలక శక్తిగా రూపుదిద్దుకుంటోంది.